రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు

 అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

ముద్ర ప్రతినిధి, జనగామ: అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళనొద్దని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు. జనగామ జిల్లాలోని అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను సోమవారం  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాల సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పరిస్థితిలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ శివలింగయ్య సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్, సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశ నిర్దేశం చేస్తున్నారని అన్నారు. 

దేవరుప్పల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంట వెంటనే తరలించాలని అన్నారు. మిల్లర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ఇంచార్జిలకు సూచించారు. సీతారాంపురంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కడివెండి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చెక్ చేశారు. ఈ తనిఖీల్లో డీఆర్డీఏ పీడీ రామిరెడ్డి, డీసీఎస్ఓ రోజా రాణి, డీఎం సంధ్యారాణి, డీఈఓ రాము, సంబంధిత అధికారులకు ఉన్నారు.