మందుల పంపిణీ పై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం

మందుల పంపిణీ పై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం

ముద్ర.వీపనగండ్ల:- ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని సబ్ సెంటర్ల ద్వారా రోగులకు అందించాల్సిన మందులను ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో నిర్లక్ష్యంగా పడేయటంపై ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. సోమవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబాయి మండలాల్లోని సబ్ సెంటర్లలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినెలా  సబ్ సెంటర్ లోని ఏఎన్ఎం లకు ఆరోగ్య కేంద్రం నుంచి మందులను పంపిణీ చేయడం జరుగుతుంది. అలా పంపిణీ చేసే క్రమంలో ఏ ఏ సబ్ సెంటర్కు ఎన్ని మందులు ఇవ్వాలో లెక్కించి ఒకచోట పేర్చి ఉంచడం జరుగుతుంది.

రివ్యూ మీటింగ్ అనంతరం అట్టి మందులను ఏఎన్ఎంలు సబ్ సెంటర్లకు తీసుకెళ్లాల్సి ఉండగా, కొందరు ఏఎన్ఎంలు మందులు తీసుకువెళ్లారని, మరికొందరు సబ్ సెంటర్ ఏఎన్ఎంలు మందులను తీసుకెళ్లకపోవడంతో ఆస్పత్రిలో చేల్లచదురుగా పడి ఉన్నాయీ.మంగళవారం ఆసుపత్రి వద్దకు వెళ్లిన  కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య చెల్లాచెదురుగా పడి ఉన్న మందులను చూసి ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా, నీవు ఎవరు మమ్ములను ప్రశ్నించడానికి, మా ఇష్టం ఉన్నట్లు చేసుకుంటాం అంటూ సమాధానం ఇచ్చారని ఎత్తం కృష్ణయ్య విలేకరులకు తెలిపారు. రోగులకు అందించాల్సిన మందులను ఇలా విచ్చలవిడిగా పడేయటం ఆసుపత్రి సిబ్బందికి తగునా అని ప్రశ్నించారు. ఈ విషయంపై డాక్టర్ రాజశేఖర్ ను వివరణ కోరగా తమ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, ఇలాంటి ఘటన మరోమారు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.