రైతుబంధు పై కాంగ్రేస్​ నీచ రాజకీయం

రైతుబంధు పై కాంగ్రేస్​ నీచ రాజకీయం
  • రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారా !
  • రాజకీయాల కోసం రైతుబంధు వద్దని కాంగ్రెస్ ఎలా చెబుతుంది ?
  • ఈసి కి రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రేస్​ రాసిన లేఖ మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి


వనపర్తి, ముద్ర : తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకంను నిలిపివేయాలని కాంగ్రేస్​ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాయడం తన వందేళ్ళ నీచ రాజకీయానికి నిదర్శంనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మంత్రి మాట్లాడుతూ..  కాంగ్రేస్​ పార్టీ రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా.. అని మంత్రి ప్రశ్నించారు. వందేళ్ల వయసు దాటినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిణతి పొందలేదని, రాజకీయ అవలక్షణాలు ఇంకా వదిలించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. సుధీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ నీచ రాజకీయాలతో  అధ్వాన్నస్థితికి చేరుకున్నదని ఆయనన్నారు.  ప్రజల అంశాల మీద ఎన్నికలు గెలవాలని, అడ్డుపుల్లలు వేసి లబ్ది పొందాలనుకోవడం రాజకీయం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.  రైతుబంధు ఎన్నికల కోసం కాదని, రైతుల కోసమని ఇంగిత ఙ్ఞనంలేని కాంగ్రెస్ పార్టీకి తెలియదా..అని ఆయన విమర్శించారు. వానాకాలం, యాసంగి పంట కాలాలకు రైతుబంధు అందజేస్తున్నామని,  ఇప్పటి వరకు 11 విడతలలో రూ.72,815 కోట్లు రైతుల ఖాతాలలో జమచేశామని అని ఆయన తెలిపారు. తెలంగాణలో 92.5 శాతం భూమి సన్న, చిన్నకారు రైతుల చేతుల్లోనే ఉన్నదని,  ప్రతి సీజన్ లో ఎకరాల వారీగా రైతుబంధు జమచేస్తున్నామని ఆయన తెలియజేశారు.  ఏడు వేల కొనుగోలు కేంద్రాలు గ్రామాల్లో పెట్టి రైతులకు రవాణ ఖర్చు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కల్లాల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, వానాకాలం వరి ధాన్యం కూడా కొనవద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నదా ? దమ్ముంటే స్పష్టం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక కొత్త పథకాలు, కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండవు కానీ అప్పటికే నడుస్తున్న పథకాలకు వర్తించదని ఎన్నికల కమీషన్ స్పష్టంగా నిబంధనల్లో పేర్కొన్నదని ఆయన తెలిపారు.

 రైతుబంధు వద్దని కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖను తెలంగాణ రైతాంగం అర్ధం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కాంగ్రెస్ నేత ఒకరు మూడు గంటల కరెంటు చాలు అంటారు,  కర్ణాటకలో ఎన్నికల హామీలు నెరవేర్చలేక ఐదు గంటలకన్నా ఎక్కువ కరంటు ఇవ్వలేమని అక్కడ కరెంటు మంత్రి తేల్చిచెప్పారని అని అన్నారు.  కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ను నమ్మి మోసపోయాం .. కాంగ్రెస్ పార్టీకి మీరు మోసపోవద్దని తెలంగాణకు వచ్చి అక్కడి రైతులు వాపోతున్నారని, కాంగ్రెస్ నేత ఉత్తమ్ రైతుబంధు పేరుతో రైతుల ఖాతాల్లో వేస్తున్న డబ్బులు దుబారా అని చెబుతున్నారని అన్నారు.  రైతులు ఎప్పుడైనా ప్రతి రూపాయి జాగ్రత్తగా పెట్టుబడికి ఖర్చు పెడతారు. కష్టం తెలిసి భూమిని, చెమటను నమ్ముకున్న వాడు రైతు పెట్టుబడికి ఎవరివద్ద చేయిచాచవద్దని కేసీఆర్ ఎంతో ఉన్నతమైన ఆలోచనతో రైతుబంధు తీసుకువచ్చారని అన్నారు.

రైతుబంధు పథకాన్ని అంతర్జాతీయ సంస్థ యూఎన్ఓలోని ఎఫ్ఎఓ విభాగం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ పథకాల్లో రైతుబంధు, రైతుభీమా గొప్పవని ప్రశంసించిందని ఆయన గుర్తు చేశారు.  రైతుబంధు వద్దని కాంగ్రెస్ రాసిన లేఖ వారి అక్కసును బయటపెట్టిందని, తెలంగాణ రైతాంగం బాగుపడడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని అబద్దాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదని ఆయన తెలిపారు.  హుజూరాబాద్ ఎన్నికలకు ముందే దళితబంధు మొదలుపెట్టాం .. దానిని కూడా వద్దని కాంగ్రెస్ చెబుతున్నదని, అణగారిన వర్గాలకు అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం దీనిని మొదలుపెట్టింది .. దశలవారీగా అందరికీ అండగా నిలవాలన్నది ప్రభుత్వ ఆలోచనని మంత్రి అన్నారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఎంత మంది దళితుల జీవితాల్లో మార్పులు తెచ్చారని, ఎన్నికల కమీషన్ కు రైతుబంధుతో పాటు పేర్కొన్న ఇతర అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. కరోనా విపత్తులోనూ తెలంగాణలో ప్రత్యేక మార్గదర్శకాలతో వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇచ్చామని మంత్రి తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలు పెట్టి జాగ్రత్తలు వహించి ధాన్యం సేకరించామని, ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా మిగిలిపోయిన రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.  యాసంగి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామనిరైతులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన రైతులకు తెలిపారు.