ప్రజల కోసం ప్రగతి కోసం తెలంగాణ

ప్రజల కోసం ప్రగతి కోసం తెలంగాణ
  • రైతులు సామూహిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలి
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి :ప్రజల కోసం ప్రగతి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి మండలాలలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామూహిక వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని, 22 ఎకరాలకు ఏడు బోర్లు మంజూరు చేస్తారని ఆయన అన్నారు. గోపాల్పేట మండలం మున్ననూరు దళిత రైతులకు రెండో పంట కోసం చేయుత అందిస్తున్నట్లు తెలిపారు. మొదటి పంట కోసం ఇప్పటికే మినీ ఎత్తిపోతల ఏర్పాటు చేసి నీటికి పూజలు చేశారు. జయన్న తిరుమలాపురం రైతులకు కూడా చేయూతన అందిస్తామని ఆయన అన్నారు. సామూహిక వ్యవసాయంతో అన్ని విధాల మేలు జరుగుతుందని, వ్యవసాయ కూలీల కొరత, సాగులో మనుషుల ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు.

మున్ననూరులో ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన బోర్ల తవ్వకానికి మంత్రి భూమి పూజలు చేశారు. తొమ్మిదేళ్లలో అన్ని రంగాల్లో సమూల మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. సాగునీటి రాకతో గ్రామాల్లో ప్రజల జీవన స్థితిగతులు మారాయి అన్నారు. గ్రామాలకు రహదారులతో పాటు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. మొత్తం 26 కోట్ల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. 18 శంకుస్థాపనలు, 19 ప్రారంభోత్సవాలు, 15 ఫార్మేషన్ రహదారులు, ఏడు బి టి రహదారులు, రెండు సిసి రహదారులు, ఒకటి సైడ్ డ్రయిన్, 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు,నాలుగు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, ఒక ప్రహరీ కి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గోపాల్పేట మండలం ఏదుట్ల శివారులో జయన్న తిరుమలాపూర్ కు చెందిన యువరైతు పరుగోళ్ల శివ వేరుశనగ పొలంలో మహిళా రైతు కూలీలను పలకరించి రైతులకు అభినందన తెలిపారు. వానాకాలం వేరుశెనగ సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట మెలకువ ల గురించి మంత్రి రైతు కూలీలకు రైతులకు వివరించారు.