ఉత్కంఠకు తెర.. ఆదిభట్ల చైర్మన్ గా నిరంజన్ రెడ్డి

ఉత్కంఠకు తెర.. ఆదిభట్ల చైర్మన్ గా నిరంజన్ రెడ్డి
  • ఫలించిన క్యాంపు రాజకీయం.. వైస్ చైర్మన్ గా కమాండ్ల యాదగిరి
  • ఆదిభట్ల అభివృద్ధికి పాటు పడతా - చైర్మన్ నిరంజన్ రెడ్డి 

ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ఎవరన్న విషయమై గత నెల రోజుల ఉత్కంఠకు తెర పడింది.. చైర్మన్ గా మర్రి నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు. ముందుగా అనుకున్నట్లుగానే తన రాజకీయ చతురతతో చక్రం తిప్పి చైర్మన్ గిరి దక్కించుకున్నారు. గతంలో చైర్పర్సన్ గా ఉన్న కొత్త ఆర్థిక ప్రవీణ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంతో ఆమె చైర్ పర్సన్ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్మన్ ను ఎన్నుకోవాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రత్యేక సమావేశంలో ఆర్డీఓ అనంత రెడ్డి సమక్షంలో ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. మొత్తం 15 మంది సభ్యులకు గాను ప్రస్తుతం పాలకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాన బలం ఉన్నది. వారం రోజులపాటు విహారయాత్రలో ఉన్న 13 మంది సభ్యులు చైర్మన్ ఎన్నిక సమావేశానికి నేరుగా హాజరయ్యారు. మాజీ చైర్మన్ కొత్త ఆర్థిక తో పాటు బీజేపీ కౌన్సిలర్ పొట్టి రాములు గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరైన కౌన్సిలర్ లు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ మర్రి నిరంజన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ముందుగా కౌన్సిలర్ల ఒప్పందం ప్రకారం కమాండ్ల యాదగిరి ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ గా ఎన్నికైన మర్రి నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ కామాండ్ల యాదగిరిలతో ఆర్డీఓ అనంత రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. 

ఫలించిన క్యాంపు రాజకీయం..

ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక లో క్యాంపు రాజకీయం ఫలించింది. ఫిబ్రవరి 9న అవిశ్వాసం మొదలుకొని సాగిన క్యాంపు రాజకీయాలు ఎట్టకేలకు మర్రి నిరంజన్ రెడ్డి ఎన్నికతో ముగిశాయి. అవిశ్వాసం ప్రవేశ పెట్టిన అనంతరం నిరంజన్ రెడ్డి నేతృత్వంలో క్యాంపులకు తరలిన కౌన్సిలర్ లు అవిశ్వాసంపై చర్చకు నేరుగా క్యాంపు నుండి వచ్చారు. అవిశ్వాసం నెగ్గిన అనంతరం కోర్టు స్టేతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మళ్ళీ కోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో మళ్ళీ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఏదైతేనేం క్యాంపులకు నేతృత్వం వహించిన నిరంజన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. 

ఆదిభట్ల అభివృద్ధికి పాటు పడతా

మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి 

ఆదిభట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నూతన చైర్మన్గా ఎన్నికైన నిరంజన్ రెడ్డిని మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తామని తెలిపారు. కౌన్సిలర్లు, అధికారులను సమన్వయం చేసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.