మా నౌకరీలు మాగ్గావాలే

మా నౌకరీలు మాగ్గావాలే
  • నిరుద్యోగ మహాధర్నాను విజయవంతం చేయండి
  • బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు

ముద్ర ప్రతినిధి కరీంనగర్: పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి భారతీయ జనతా పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని అందులో భాగంగా మా నౌకరీలు మాగ్గా వాలే అనే నినాదంతో తలపెట్టిన నిరుద్యోగుల మహా ధర్నాను విజయవంతం చేయాలని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. నిరుద్యోగులకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న హైదరాబాదులో తలపెట్టిన నిరుద్యోగ మహాధర్నా కు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఇన్నేళ్లకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి పేపర్ లీకేజీ అంశంతో ఆ పరీక్షలను రద్దుచేసి నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాడమాడుతుందనే విషయం దీంతో స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి తెలంగాణలో ఉందని, అందుకే నిరుద్యోగుల వ్యతిరేక కెసిఆర్ సర్కార్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి బిజెపి ఎనలేని పోరాటం చేస్తుందన్నారు. ముఖ్యంగా పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన కనుసనల్లో పనిచేసే సిట్ వ్యవస్థతో పేపర్ లీకేజీ వ్యవహారాన్ని మరుగునపెట్టే ఆస్కారం ఉందని, ఇదివరకు అనేక అంశాల్లో  వేసిన సిట్ దర్యాప్తుల సంగతి ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై ఎవరికీ నమ్మకం లేదని, అందుకే నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బిజెపి పార్టీమొదటి నుండి డిమాండ్ చేస్తుందన్నారు.

30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల ను కెసిఆర్ ప్రభుత్వం రోడ్డుపాలు చేసిందని, అందుకే నిరుద్యోగుల కు అండగా నిలిచి వారి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో కెసిఆర్ ప్రభుత్వంపై  బిజెపి తగిన పోరాటం చేస్తుందన్నారు. అందులో భాగంగా ఈనెల 25న శనివారం రోజున హైదరాబాదులోని ఇందిరా గార్డెన్  ధర్నా చౌక్ లో తలపెట్టిన నిరుద్యోగ మహాధర్నాను విజయవంతం చేయడానికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బిజెపి శ్రేణులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా  నిరుద్యోగులు అందర్నీ మహా ధర్నాలో భాగస్వామ్యం చేయడానికి బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.