జనవరి 6 వరకు ప్రజలు దరఖాస్తులను సమర్పించాలి....

జనవరి 6 వరకు ప్రజలు దరఖాస్తులను సమర్పించాలి....
  • రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41, 42 వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: అర్హులకు ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు జనవరి 6 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం కలెక్టర్ ర్రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41, 42వ డివిజన్ల యందు ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.

ప్రజా పాలన కేంద్రాలకు వచే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని, దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు లేదని ఆయన పేర్కోన్నారు.ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చిన  ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు.రామగుండం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రి పని తీరు , వైద్యం కోసం వెళితే ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న స్పందన వివరాలను ప్రజల నుంచి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

 ప్రభుత్వ గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.  గ్యారంటీ పథకాలతో పాటు ఏ ఇతర అంశంపై ప్రజలు అధికంగా దరఖాస్తు సమర్పిస్తున్నారనే అంశాన్ని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సైతం మౌళిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ కు ధీటుగా విద్య బోధిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి పిల్లలను పంపాలని కలెక్టర్ మహిళలకుసూచించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రభుత్వ గ్యారంటీలతో పాటు, ఇతర సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇతర దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలు అన్నిటినీ పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.రేషన్ కార్డుల దరఖాస్తులను ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వీకరించాలను, వచ్చిన దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, కార్పొరేటర్ లు బాలరాజు, విజయ, సంబంధిత అధికారులు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.