నిరాదరణకు గురయ్యే వృద్దులకు పోలీస్ చేయూత

నిరాదరణకు గురయ్యే వృద్దులకు పోలీస్ చేయూత
  • వాట్సప్ లో సమాచారం ఇస్తే తక్షణ సహాయం
  • పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: మీ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారా? వృద్ధులని కూడా చూడకుండా నిరాదరణకు గురిచేస్తున్నారా? మీరు స్వయంగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయలేని పరిస్థితులలో పోలీసులే మీ చెంతకే వచ్చి సాయం చేస్తారు. మీరు చేయాల్సిందల్లా... రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ 8712662111 నెంబరుకు సమాచారం ఇవ్వడమే... పోలీసులే స్వయంగా మీ చెంతకు వచ్చి మీకు అవసరమైన సహాయం చేస్తారు.. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి  ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు వారు అందిస్తున్న సేవల సమీక్షలో భాగంగా ఆయన శనివారం బీబీనగర్ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని, వారితో మమేకమై పనిచేయాలని ఆయన సూచించారు. మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, బాధితులు దైర్యంగా స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసేలా వాతావరణం ఉండాలని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పోలీస్ అదికారులను కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపిఎస్, భువనగిరి ఏసిపి, బీబీనగర్ ఎస్ఐ ఎస్.రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.