గిరిజన ప్రాంతాలలో మంజూరైన అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలి... 

గిరిజన ప్రాంతాలలో మంజూరైన అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలి... 

 మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: మారుమూల గిరిజన ప్రాంతాలలో మంజూరైన అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ శశాంక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గురువారం పర్యటించి కొత్తగూడ రైతు వేదికలో కొత్తగూడ,గంగారం రెండు మండలాల అభివృద్ధి పనులను ములుగు శాసన సభ్యురాలు సీతక్క అధ్యక్షతన ఏటూరు నాగారం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్ లతో కలిసి సమీక్షించారు. సంబంధిత ప్రజాప్రతినిధులు , అధికారులతో రోడ్ల అభివృద్ధి త్రాగునీరు కంటి వెలుగు ఆరోగ్య మహిళ వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ...
ఏజెన్సీలో ప్రధాన సమస్య రహదారులని నిర్ణీత సమయంలో పూర్తి చేయగలిగితే ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. పనులలో జాప్యం ఏర్పడితే సమస్యలు ఉత్పన్నమైతాయన్నారు. త్రాగునీటి సమస్యపై మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని వేసవికాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమంలో 100 మందికి తక్కువ కాకుండా  పరీక్షలు నిర్వహించాలని, మిర్చి సీజనున్న విస్తృత ప్రచారం చేపట్టి ప్రతి ఒక్కరికే పరీక్షలు నిర్వహించాలన్నారు ప్రతి పి ఎస్ సి లో వారానికి రెండు రోజులు కేటాయించి ఆయా తేదీలలో కంటి పరీక్షలు చేస్తున్నట్లు ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలన్నారు.ఆరోగ్య మహిళ కార్యక్రమం క్రింద మహిళలైన ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన ఎనిమిది రకాల పరీక్షలు చేయించుకోవాలన్నారు. దూర ప్రాంతాల వారికి ఆర్ పి ఎస్ కే వాహనాలు కానీ 102 వాహనం కానీ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు.

సబ్ సెంటర్ల పురోగతిని సమీక్షిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామీ పనులు వినియోగించుకుని  అధిక సంఖ్యలో కూలీలు పాల్గొనేందుకు అధికారులు కూలీలను ప్రోత్సహించాలన్నారు. కూలీలు ఎంతమంది పాల్గొంటే అంతగా నిధులు సీసీ రోడ్లకు మంజూరు అవుతాయన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ కొమరయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారి హేమలత, రోడ్లు భవనాల ఇంజనీరింగ్ అధికారి తానేశ్వర్, డిఆర్టిఏ పీడి సన్యాసయ్య, ఉప వైద్యాధికారి అంబరీష, మిషన్ భగీరథ అధికారులు సురేందర్, కృష్ణారెడ్డి, కొత్తగూడ గంగారం తహసిల్దార్లు నరేష్,పద్మావతి ఎంపీడీవోలు భారతి, వెంకటేశ్వర్లు, కొత్తగూడ గంగారం మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.