Shankhabrata Bagchi - ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

Shankhabrata Bagchi - ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ ఇంఛార్జీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ తాజాగా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఆయన కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. డీజీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే డీజీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఆదివారం వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన్ని వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. డీజీపీ పోస్టు కోసం సోమవారం ఉదయం 11 గంటలలోపు ముగ్గురు డీజీ ర్యాంక్ స్థాయి అధికారుల జాబితాను పంపించాలని ఆదేశాలు ఇచ్చింది.

కాగా ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజేంద్రనాథ రెడ్డి వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారనే విమర్శలు మాత్రం రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా ఏ రోజూ పట్టించుకోలేదని ఆయా పార్టీల నేతల ఆరోపించిన సంగతి అందరికీ తెలిసినదే. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఆయన అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనకు పిలుపునిచ్చినా అణగదొక్కడంపై అయితే తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే ఆయన ప్రతిపక్షాలకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారనే ప్రచారం సాగింది. ఆయన డీజీపీగా ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఈ ఫిర్యాదులతో విచారణ చేసిన ఈసీ.. డీజీపీపై బదిలీ వేటు వేసినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించొద్దని ఆదేశించింది. ఇకపోతే రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు తరువాత ఇప్పుడు కొత్త డీజీపీగా ఎవరిని నియమిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం సీనియార్టీ జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు.