కౌంటింగ్ కి పటిష్ఠ  ఏర్పాట్లు.

కౌంటింగ్ కి పటిష్ఠ  ఏర్పాట్లు.
  • నియోజక వర్గానికి 14 టేబుల్స్ 
  • ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు
  • నిఘా నేస్తంలో పటిష్ఠ భద్రత
  • జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జిల్లాలో  3న జరిగే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ఠ  ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు నాలుగు నియోజక వర్గాల  స్ట్రాంగ్ రూమ్స్ తో పాటు కౌంటింగ్ హాల్స్ ను ఎస్.పి రాహుల్ హెగ్డే తో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా  కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ప్రతి నియోజక వర్గం హాల్ లో  14 చొప్పున మొత్తం 56  టేబుల్స్ ఏర్పాటు చేసి  ప్రతి టేబుల్ కి మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్ విసుర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అలాగే  పార్టీ ఏజెంట్ల తో పాటు సర్వీస్ అందించేందుకు 50 మంది రెవెన్యూ సిబ్బంది ఉంటారని తెలిపారు. 

కౌంటింగ్ రోజున నిఘా నీడలో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామని అన్నారు.  హుజూర్ నగర్  308 పోలింగ్ కేంద్రాలకు 22  రౌండ్స్, కోదాడ 296 పోలింగ్ కేంద్రాలకు 22 రౌండ్స్, సూర్యాపేట లోని 271 పోలింగ్ కేంద్రాలకు 20 రౌండ్స్, అలాగే తుంగతుర్తి లోని 326 పోలింగ్ కేంద్రాలకు 24 రౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా పోస్టల్ బ్యాలెట్  కౌంటింగ్ కొరకు హుజూర్ నగర్ కౌంటింగ్ హల్ కు 4 టేబుల్స్, కోదాడకు 5 టేబుల్స్, సూర్యాపేటకు 6 టేబుల్స్, తుంగతుర్తి కి 3 టేబుల్స్ మొత్తం 18 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు కౌంటింగ్ వివరాలను పాత్రికేయ మిత్రులకు తెలుపుటకు మార్కెట్ యార్డ్ నందు మీడియా సెంటర్ ఏర్పాటు చేయనైనదని తెలిపారు.