కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్ట బందోబస్తు

కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్ట బందోబస్తు

కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో శుక్రవారం అన్నీ పోలీస్ స్టేషన్ల, వివిధ విభాగాలకు చెందిన అధికారులందరితో పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని ఆయన అన్నారు. పటిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో అధికారులందరూ పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని స్థాయిలకు చెందిన అధికారులు పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎంతో అప్రమత్తంగా ఉంటూ వారికి కేటాయించబడ్డ విధులు సక్రమంగా నిర్వహించారన్నారు. దీనికిగాను అన్ని విభాగాలకు చెందిన అన్ని స్థాయిలకు చెందిన అధికారులందరినీ  ప్రత్యేకంగా అభినందించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ,  పోస్ట్ పోలింగ్ ఇంకా మిగిలి ఉందని అధికారులు, సిబ్బంది గుర్తించాలన్నారు. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల కమీషన్,  ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. దీనికిగాను కరీంనగర్ లోని నాలుగు నియోజకవర్గాలయిన కరీంనగర్, చొప్పదండి,మానకొండూర్, హుజూరాబాద్ లకు చెందిన ఈవీఎంలను స్థానిక ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేసి వాటిని అవసరమయిన భద్రత కలిపించామన్నారు. 

ఇదే కళాశాల యందు నియోజకవర్గాల వారిగా కౌంటింగ్ సెంటర్ లను  ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూముల భద్రతకై కేంద్ర సాయుధ బలగాలని కేటాయించమన్నారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన పటిష్ట బందోబస్త్ ప్రణాళిక సిద్ధం చేశామని, అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. విధుల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసేలా నిబద్దత తో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మీనారాయణ(శాంతి భద్రతలు),  సి.రాజు, (పరిపాలన), ఏసీపీలు నరేందర్ (టౌన్), కరుణాకర్ రావు(రూరల్) జీవన్ రెడ్డి (హుజూరాబాద్), శ్రీనివాస్ (సి.ఎస్.బి), సర్వర్ (ట్రాఫిక్) విజయ్ కుమార్ (సీ.సీ.ఆర్.బి/ ఎలక్షన్స్ సెల్), కాశయ్య (ఐటీ సెల్ ),మాధవి (సి.సి.ఎస్), వేణు (సి టి సి), ప్రతాప్ (ఎ.ఆర్.) అన్నీ పోలీసు స్టేషన్ లకు చెందిన ఎస్.హెచ్. ఓ లు, హెడక్వార్టర్స్ కి చెందిన ఆర్.ఐ. లు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.