దొడ్డి కొమురయ్య  స్ఫూర్తితో ఉద్యమిస్తాం- మిల్కూరి వాసుదేవ రెడ్డి

దొడ్డి కొమురయ్య  స్ఫూర్తితో ఉద్యమిస్తాం- మిల్కూరి వాసుదేవ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం  సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో జిల్లాలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ముకుంద లాల్ మిశ్రా భవన్లో దొడ్డి కొమురయ్య  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ దొరలకు, దేశ్ ముఖ్ లకు, జాగిర్దారులకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 1946 జూలై 4న కడివెండి గ్రామంలో నిర్వహించిన ప్రదర్శనలో అగ్ర భాగాన నిలబడి దొరల, పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా నినదించిన గొప్ప పోరాట యోధులు అన్నారు. దొడ్డి కొమురయ్య అమరత్వంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. అప్పటి తెలంగాణలోని నిజాం సంస్థానంలో అత్యంత క్రూరులైన ఫ్యూడల్, భూస్వాములు పేద ప్రజానీకంపై అత్యంత దాస్థికంగా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడేవారున్నారు. విష్ణురు దేశ్ముఖ దౌర్జన్యాలకు తిప్పి కొట్టడానికి కమ్యూనిస్టు పార్టీ కడివెండి గ్రామంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ దళం ప్రదర్శనలో పాల్గొన్న కొమురయ్యను కాల్చి చంపారన్నారు.

కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాడు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలు ఇచ్చిన 4000 మంది త్యాగదనులు వారు అందించిన కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమి పంపకం వల్ల పేద,కౌలు రైతులు దొరల దోపిడీ నుండి విముక్తి పొందారన్నారు. దొడ్డి కొమురయ్య  స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామ మన్నారు.

దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మనుషుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ మనుస్మృతిని దేశంలో ప్రవేశపెట్టేందుకు చేసే కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు.
 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం త్యాగపూరితమైన ఉద్యమం భవిష్యత్ తరాలకు అనుసరణీయమని, ఆదర్శనీయమని అన్నారు. అంతరాలు లేని సమసమాజ స్థాపన కోసం దొడ్డి కొమురయ్య  స్ఫూర్తితో ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, డి నరేష్ పటేల్ నాయకులు వినోద్, రాజ్ మహమ్మద్,కొండయ్య, మొండయ్య,బాపయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.