ప్రశాంతంగా కొనసాగుతున్న పోలీస్ సెలక్షన్స్

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలీస్ సెలక్షన్స్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పక్రియలో భాగంగా 4వరోజు అదనపు అభ్యర్థులకు ఆదివారం శారీరక సామర్థ్య, దేహదాఢ్య పరీక్షలు సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సిటిసి)లో ప్రశాంతంగా జరిగాయి. పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ప్రత్యక్ష పరిశీలనలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. తొలుత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీల, రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్, రిస్ట్ బ్యాండ్ టాగింగ్, ఆర్ఎఫ్ఐడి బిబ్ జాకెట్లను ధరింపజేశారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒకగంటముందే నుండి తరలివచ్చారు. అభ్యర్థులను ఒక క్రమపద్ధతిలో ఉంచేందుకు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. పురుషులు 1600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలతోపాటు లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా పరీక్షలు జరుగుతున్న సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సిటిసి) ఆవరణలో షామియానాలు, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 


 ఆదివారం నాడు జరిగిన శారీరక సామర్థ్య పరీక్షలకు 1326 మంది హాజరుకావాల్సి ఉండగా 211 మంది గైర్హాజరయ్యారు. హాజరైన 1082 మందిలో 357 మంది అర్హత సాధించారు. 725 మంది అర్హత సాధించలేకపోయారు. మరో 33 మంది అనారోగ్యకారణాలు చూపుతూ ధృవపత్రాలను సమర్పించారు. వైద్యుల పరిశీలన అనంతరం పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు సదరు అభ్యర్థులకు ఇతర తేదీలలో
హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్, ఎసిపిలు కాశయ్య, కె శ్రీనివాస్, సత్యనారాయణ, కరుణాకర్ రావు, సత్యనారాయణ, సి.ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరామయ్య, సూపరింటెండెంట్ ఏవిఎన్ చారి, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు మాధవి, బి సంతోష్ కుమార్, యం రవికుమార్, కరుణాకర్, రవీందర్, కె సురేష్, స్వర్ణజ్యోతి, ఆఐలు సురేష్, జానీమియా, రమేష్, మురళి, మల్లేశంలతోపాటుగా మినిస్టీరియల్ విభాగం అధికారులు, సిబ్బంది, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.