వనం..జనం..

వనం..జనం..
  • ఏడుపాయల జాతరలో  కిక్కిరిసిన భక్తజనం
  • ఘనంగా బండ్ల ఊరేగింపు
  • మహిళలబోనాలు ...శివసత్తుల పూనకాలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళల నెత్తిన బోనాలు... మరోవైపు శివసత్తుల పూనకాలు... పోతరాజుల విన్యాసాలు... ఎడ్ల బండ్ల ప్రదర్శన.... తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా   ఏడుపాయల జాతర సాగుతోంది. ఆదివారం ఏడుపాయలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా శివరాత్రి ఉపవాసాలు ఆచరించిన భక్తులు ఉదయమే అమ్మవారిని దర్శించుకుని ఒక్కపొద్దులు వదిలారు. మునుపెన్నడూ లేనివిధంగా కలెక్టర్ రాజర్శి షా, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిల ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి  భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొద్దంతా బోనాల సందడి నెలకొంది. డప్పుల మోతలు, శివసత్తుల సిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడింది. సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలో నృత్యాలు జాతర భక్తులను అలరించాయి.  దూర ప్రాంతాల నుంచి  కుటుంబ సమేతంగా జాతరకు వచ్చిన వారు ఏడుపాయల్లోనే మేకలు, కోళ్లు కోసుకొని వంట వండుకుని ఆరగించారు.

ఘనంగా బండ్ల ఊరేగింపు
డప్పుల దరువులు... యువకుల నృత్యాలు... జై బోలో దుర్గా భవానీ మాతాకీ అంటూ భక్తుల జయ జయ ద్వానాలా మధ్య  సాయంత్రం ఏడుపాయల జాతరలో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు ఏడుపాయల  కొబ్బరికాయ కొట్టి బండ్ల ఊరేగింపును ప్రారంభించారు. పాపన్నపేట, టేక్మాల్, ఆల్లాదుర్గం, కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎడ్ల, గుమ్మటాల బండ్లు పెద్దసంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నాయి. బండ్లను రంగురంగుల చీరలు, మామిడి తోరణాలు, వేపకొమ్మలతో అలంకరించగా, బంగారు రంగు మెరుపు కాగితాలు, దేవుళ్ల ఫొటోలతో అలంకరించిన గుమ్మటాల బండ్ల ఆకట్టుకున్నాయి. నాగ్సాన్ పల్లి నుంచి ప్రారంభమైన బండ్ల ఊరేగింపు ఏడుపాయల్లోని మెయిన్‌‌ రోడ్డు మీదుగా రాజగోపురం ముందునుంచి సాగింది.

దారులన్ని ఏడుపాయలకే
బండ్ల ఊరేగింపును తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా సంఖ్యలో తరలిరావడంతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. కుటుంబ సమేతంగా  తరలిరావడంతో దారులన్నీ ఏడుపాయల జాతరకు సాగాయి. మంజీరా నాదీ పాయల్లో  భక్తులు స్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించారు. అమ్మవారికి ఒడి బియ్యం పోశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నది ప్రాంతంలో ఆయా చోట్ల గజ ఈతగాళ్ళను నియమించారు.

ఇద్దరు మృతి
జాతరలో అన్ని రకాల చర్యలు చేపట్టినా ఆపశ్రుతి తప్పలేదు. ఇద్దరు మృతి చెందారు. పాపన్నపేట మండలం శేరిపల్లికి చెందిన రవి (32) మూర్చ వ్యాధితో మంజీరాలో మునిగి మృతి చెందారు. గజ ఈతగాడు గుమ్మడి సాయిలు  చెక్ డ్యాంలో మునిగి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.