చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్:చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు కుంటలో పడి మృతి చెందిన ఘటన చేగుంట మండల కేంద్రంలోని మామిడికుంట వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలీలా ఉన్నాయి...మండల పరిధిలోని వడియారం గ్రామానికి చెందిన గేటు మల్లేశం (35), బొక్క యాదగిరి (28)లు మంచి స్నేహితులు. ఆదివారం ఇద్దరూ కలిసి మండల కేంద్రంలోని స్మశాన వాటిక వద్ద ఉన్న మామిడికుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు. అంతకుముందు కుంటలో నీళ్లు నిలిచేందుకు జెసిబిలతో పెద్ద పెద్ద గుంతలు తీయించారు.

అది గమనించని మల్లేశం, యాదగిరి కుంటలో దిగి గల్లంతయ్యారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోన్ రింగ్ అవుతున్నప్పటికీ ఎంతకు ఫోన్ లిఫ్టు చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మామిడి కుంట వద్ద పరిశీలించారు.

కుంట వద్ద  చూస్తే ఒడ్డుపై ఇద్దరి బట్టలు, వలలు, గడియారం కనిపించాయి. చివరికి చేగుంట పోలీసులు శ్రమించి కుంటలో ఉన్న మృతదేహాలను వెలికి తీయించారు. కేసు నమోదు చేసుకున్న చేగుంట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబాన్ని పోషించే ఇద్దరి యువకులు చేపలు పట్టడానికి వెళ్లి విగతా జీవులుగా తిరిగి రాకపోవడంతో బాదిత కుటుంబాల రోదనలతో వడియారం గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది.