సుడా చైర్మన్ కు అవమానం?

సుడా చైర్మన్ కు అవమానం?

నరేందర్ రెడ్డిని అవమానించారంటూ ఆడియో వైరల్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : పదేళ్ల బిజెపి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, రాష్ట్ర విభజన హామీల వైఫల్యాలు, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా స్థానిక డిసిసి కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని వేదిక మీదికి పిలవకుండా కింద కూర్చోబెట్టి అవమానపరిచారంటూ యూత్ కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ రెహమాన్ అసహనం వ్యక్తం చేసిన ఆడియో వైరల్ గా మారింది.

కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిన వ్యక్తి నరేందర్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తూ స్టేజ్ పైకి పిలిచి కూర్చోబెట్టడం, కాంగ్రెస్ పార్టీ సీనియర్లను విస్మరించడం ఎంతవరకు సమంజసం అని ఆ ఆడియోలో ప్రశ్నించారు. ఇకముందు ఇలాంటివి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీక్ష కార్యక్రమంలో ప్రోటోకాల్ కరీంనగర్ కాంగ్రెస్ లో పెను దుమారం రేపుతుంది. ఇదిలా ఉండగా ఆడియో వైరల్ పై సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని వివరణ అడగగా స్థలాభావం వల్ల కింద కూర్చోవడం జరిగిందని, ఇక్కడ ఎవరిని అవమానపరిచే ఉద్దేశం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో సమిష్టి పోరాటంతో కరీంనగర్ సీటు విజయమే లక్ష్యంగా గా పనిచేస్తున్నామని తెలిపారు.