మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ -ముస్లింలకు ఈద్ ముబారక్ : పోచారం శ్రీనివాస్ రెడ్డి

మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ -ముస్లింలకు ఈద్ ముబారక్ : పోచారం శ్రీనివాస్ రెడ్డి

 ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీక అని, పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, సహాయం, ధానగుణం, కష్టసుఖాలను పరస్పరం పంచుకునే సద్గుణాలను ఈ పవిత్ర రంజాన్ మాసం నేర్పిందన్నారు. మైనారిటీల సంక్షేమానికి దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు.

రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మత్తులకు నిధులిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇమామ్,మౌజంలకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారని,పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీ ముభారక్ ద్వారా రూ.1,00,116 లు ఉచితంగా అందజేస్తున్నదని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు అందరూ తమ బందు‌, మిత్రులతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని స్పీకర్ పోచారం కోరారు.