అన్ని రంగాల్లో బాన్సువాడను అభివృద్ధి చేశా !

అన్ని రంగాల్లో బాన్సువాడను అభివృద్ధి చేశా !
  • పేదవారందరికి స్వంత ఇల్లు నా లక్ష్యం. 
  • బాన్సువాడ లో గెలిచేది నేనే, రాష్ట్రంలో వచ్చేది BRS పార్టీ ప్రభుత్వమే

 
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:బాన్సువాడ నియోజకవర్గాన్ని రూ.10వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని అసెంబ్లీ స్పీకర్, బిఆరెస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బాన్సువాడ పట్టణం పరిధిలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన ప్రచార సభలలో పోచారం  ప్రసంగిస్తూ, నాకు మద్దతు తెలుపుతూ ఇంత భారీ ఎత్తున వచ్చిన అక్కా చెల్లెలు, అన్నా తమ్ముళ్లు అందరికీ ధన్యవాదాలన్నారు. నేను లోకల్-మీరు లోకల్ అని,నేను బాన్సువాడ పట్టణంలో చేసిన అభివృద్ధి పనులన్నీ మీ కంటి ఎదురుగా అగుపడుతున్నాయని అన్నారు. 2014 కు ముందు బాన్సువాడ పట్టణం ఎట్లుండే ఇప్పుడు ఎట్ల ఉన్నదని, ఒకసారి ఆలోచన చేయండని అన్నారు.

గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడ ను మున్సిపాలిటీ గా మార్చానని, రూ. 650 కోట్లతో బాన్సువాడ పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశానని,రూ. 40 కోట్లతో ప్రధాన రహదారి విస్తరించానని అన్నారు.రూ. 100 కోట్లతో గల్లిగల్లికి సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని,
పట్టణానికి 2400 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు  చేశానని అన్నారు.బాన్సువాడ పట్టణంలో పేదలందరికి స్వంత ఇల్లు ఉండాలన్నది నా లక్ష్యమని అన్నారు. రూ. 20 కోట్లతో మాతా-శిశు ఆసుపత్రి ఏర్పాటు చేయించానని,కిడ్నీ బాధితుల డయాలసిస్ కోసం 10 మెషిన్లు ఏర్పాటు చేయించానని,బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయించానని,మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ త్రాగునీరు వచ్చేలా పైప్ లైన్లు ఏర్పాటు చేయించానని వివరించారు.రూ.7 కోట్లతో  కల్కి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా సుందరికరించామని అన్నారు.ప్రజల అహ్లాదం కోసం రూ. 4 కోట్లతో చిల్డ్రన్ మరియు మల్టీజనరేషన్ పార్కులను ఏర్పాటు చేసామన్నారు.బాన్సువాడ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని,BRS పార్టీ మేనిఫెస్టో పేదలకు అనుకూలంగా ఉన్నదని అన్నారు.

ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వంలో మరిన్ని పథకాలను అమలు చేస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి 2014 నుండి 2018 వరకు ఎల్లారెడ్డి MLA గా ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేయలేదని, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు చేయలేదని,ఆయన స్వగ్రామం ఎర్రపహాడ్ లో పది కోట్లు పెట్టి పెద్ద భవంతి కట్టుకున్నాడు, కానీ ఎల్లారెడ్డి  నియోజకవర్గంలో మాత్రం పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేయలేదని ఆరోపించారు.నేను మీ వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, ఆశీర్వదించండని,నవంబర్ 30న జరిగే పోలింగ్ లో మీరందరూ కారు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ సభలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ప్రజా ప్రతినిధులు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.