తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష
  • కేంద్రం నుంచి రూ.2 లక్షల కోట్లు రావాలి
  • బిజెపి పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు శూన్యం 
  • నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • కేంద్రంపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ధ్వజం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 2 లక్షల కోట్లను ఇవ్వకుండా, రిజర్వ్ బ్యాంకు నుంచి నిధులు రాకుండా చేసి, కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి పాలిత 19  రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత 4 రాష్ట్రాల్లో తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలవుతున్నయా? అని ప్రశ్నించారు. అమలవుతున్నట్లు నిరూపిస్తే తాను  శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలోనే సవాలు చేశానని పేర్కొన్నారు. సోమవారం స్పీకర్ పోచారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంపై ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 3 .73  లక్షల కోట్లను పన్నుల రూపంలో చెల్లించగా, కేంద్రం కేవలం 1 .79 లక్షల కోట్లే గ్రాంట్ రూపంలో ఇచ్చిందని తెలిపారు. ఉచిత విద్యుత్తూ ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డుతోందని, మోటార్లకు మీటర్లు పెడితేనే ఎఫ్ ఆర్ బి ఎం ద్వారా ఆరు వెల కోట్లు ఇస్తామని పేచీ పెట్టిందని తెలిపారు. ఇన్సూరెన్స్, రైల్వే, సింగరేణి, ఎయిర్పోర్టు, విశాఖ ఉక్కు తదితరాలను ప్రయివేటు పరం చేస్తోందన్నారు. యూపీఏ హయాంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఐన ఐటీఐఆర్ మంజూరు కాగా, మోడీ ఆ ప్రాజెక్టును గుజరాత్ కు తరలించారని, రూ.౩లక్షల కోట్ల ప్రాజెక్టు అన్నారు. కేంద్రం అన్ని రంగాల్లో తెలంగాణ కు సహాయ నిరాకరణ చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు భర్తీ చేయలేదని తెలిపారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే  సిబిఐ, ఈ డి కేసులు పెట్టి వేధిస్తున్నారని, వీటికి భయపడేది లేదని అన్నారు. 

బి ఆర్ ఎస్ వైపు దేశం చూపు
తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి దేశ్ ప్రజలు ఆకర్షితులవుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతు బంధు, ఉచిత విద్యుత్తూ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గురుకులాలు ఇతర సంక్షేమ పథకాలు ఆకర్షిస్తున్నాయని అన్నారు. మహారాష్ట్రలో బి ఆర్ ఎస్ కు విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు.  105 అడుగుల  అంబెడ్కర్ విగ్రహం దేశంలోనే ఎతైన విగ్రహమని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. బిజెపి నాయకులూ కనీస అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని, వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 

25 న బి ఆర్ ఎస్ ప్లీనరీ సమావేశం
  భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎప్రిల్ 25, మంగళవారం నాడు  బాన్సువాడ నియోజకవర్గ స్థాయి మినీ ప్లీనరీ  నిర్వహిస్తున్నామని స్పీకర్ పోచారం తెలిపారు.  మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అందరూ ఈ ప్లీనరీ సమావేశానికి హాజరు కావాలని  కోరారు. కొల్లూరు రోడ్డులోని SMB ఫంక్షన్ హాల్ లో ఉదయం  9 గంటలకు ఈ సమావేశం ఉంటుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో రైతు బందు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, నాయకులు ఎజాస్, పాత బాల కృష్ణ, గోపాలరెడ్డి, మోహన్ నాయక్, షేక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.