అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం

అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం
  • మొదటగా ఇండ్లు నిర్మించి ఇస్తాం 
  • తాత్కాలిక భోజనం, వసతి  ఏర్పాట్లు చేశాం
  • బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కరీంనగర్లోని ఆదర్శనగర్ లో మంగళవారం అగ్ని ప్రమాదంలో దాదాపు 21 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. బుధవారం ఉదయం ఘటన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు, నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారంతా రోజువారి కూలి పని చేసుకునే నిరుపేదలేనని పేర్కొన్నారు. ప్రమాదంలో బట్టలు, నిత్యవసర వస్తువులు, సర్టిఫికెట్లు దగ్ధం కావడం దురదృష్టకరమని తెలిపారు. వీరికి తాత్కాలికంగా భోజన వసతి, నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు పార్టీ తరఫున కూడా వారికి సామాగ్రి అందిస్తామని చెప్పారు. కొద్ది రోజుల్లో వారికి శాశ్వతంగా కూడా గృహ వసతి కల్పిస్తామని చెప్పారు. రాజీవ్ స్వగృహతో పాటు వేరే చోట వారు నివాసం ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.

ప్రజా పాలనలో భాగంగా నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందులో అగ్ని ప్రమాద బాధితులకు మొదటి ప్రాధాన్యతలో ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. పూరి గుడిసెలతో పాటు ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. జిల్లాలో కబ్జాకు గురైన  ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి త్వరలో జిల్లాలో పర్యటించనున్నారని ఈ మేరకు అన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసు స్థానిక కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు, కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వైద్యుల అంజన్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.