ఘనంగా వి. మధుసూదనరావు శతజయంతి వేడుకలు

ఘనంగా వి. మధుసూదనరావు శతజయంతి వేడుకలు

తెలుగు సినిమా స్వర్ణయుగానికి మెరుగులు దిద్దిన మహోన్నతులైన దర్శకుల్లో వీరమాచినేని మధుసూదనరావు అలియాస్‌ విక్టరీ మధసూదనరావు ఒకరు. ఆత్మబలం, గుడిగంటలు, కల్యాణమంటపం, లక్షాధికారి, భక్తతుకారం, పదండి ముందుకు, ఆరాధన, మనుషులు మారాలి, మల్లెపూవు, చక్రవాకం, వీరాభిమన్యు, రక్తసంబంధం, విక్రమ్‌, సామ్రాట్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా చరిత్రలో 71 సినిమాలకు దర్శకత్వం వహించి.. 95 శాతం విజయాలను స్వంతం చేసుకున్న ప్రతిభాశీలి వి. మధుసూదనరావు. 1923 జూన్‌ 14న జన్మించిన 2023కి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శతజయంతి వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో ఘనంగా నిర్వహించారు అయన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మధుసూదనరావు గారి శిష్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అనివార్య కారణాల వల్ల ఈ సభకు హాజరుకాలేకపోతున్నానంటూ తన సందేశాన్ని లేఖ రూపంలో పంపించారు.

ఆ లేఖలో ‘‘ విజయాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న శ్రీ వి. మధుసూదనరావు గారి గురించి ఈ తరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అభ్యుదయానికి పార్టీలు, సిద్ధాంతాలతో పని లేదు. మానవతా వాదమే అసలు సిసలు అభ్యుదయవాదం. అటువంటి అభ్యుదయవాది శ్రీ వి.మధుసూనరావు గారు. ఆయన బాల్యానికి, నా బాల్యానికి సారూప్యతలున్నాయి. అమ్మ ఒడే బడి కావాల్సి ఉండగా మాకు సమాజమే బడి అయింది. శ్రీ వి. మధుసూదనరావు గారికి విజయాలు సునాయాసంగా దక్కలేదు. రాయలసీమ కరువు బాదితుల సహాయార్ధం సినీ దిగ్గజాలందరూ నాటక ప్రదర్శన తలపెట్టినప్పుడు మధుసూదనరావు గారి జీవితంలో ఎదురైన అతి సంక్లిష్ట పరిస్థితి, అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన ఎంతటి మానవతా వాదో తెలియజేస్తుంది.

తాను నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంతంగా, రాజీలేకుండా పరిశ్రమించారు. స్వాతంత్య్రోద్యమ ప్రభావంతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. ఆయన చలనచిత్రాలు నేను చాలా చూశాను. అభ్యుదయ వాదాన్ని సామాన్య ప్రజానీకానికి మరింత చేరువ చేయడానికి ఆయన సినీ మాధ్యమాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ఎంతో మంది కథానాయకులకు, కథానాయికలకు, ఇతర నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి, దర్శకులకు బ్రేక్‌ ఇచ్చినా అది తన ఘనతగా ఏనాడూ చెప్పుకోని నిగర్వి, సమాజంపై ప్రభావం చూపిన విజయాలు. మనుషుల ఆలోచనల్లో మార్పులు తెచ్చిన విజయాలు వీరమాచనేని మధుసూదనరావు… విక్టరీ మధుసూదనరావు అయ్యారు. ‘వి’ అంటే సమాజంలో మార్పునకు బీజం వేసిన విక్టరీ. ‘వి’ అంటే వినూత్న పథగామి. ‘వి’ అంటే విలువలకు కట్టుబడిన మనిషి. శ్రీ వి.మధుసూదనరావు గారి స్ఫూర్తిని నేటి తరానికి కూడా తెలియచెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన శతజయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న శ్రీ వి. మధుసూదన రావు గారి కుటుంబసభ్యులకు నా అభినందనలు’’ అని పేర్కొన్నారు.