వనపర్తి జిల్లాలో దారుణం  బ్లాస్టింగ్ లో బాలుడు మృతి

వనపర్తి జిల్లాలో దారుణం  బ్లాస్టింగ్ లో బాలుడు మృతి

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో జరిపిన బ్లాస్టింగ్ వల్ల నిక్షిత్(4) అనే బాలుడు మృతి చెందాడు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న చిన్నపాటి గుట్టపై సామూహిక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం ఎంపిక చేశారు అక్కడ నిర్మాణానికి రాళ్లు అడ్డుగా ఉండడంతో బ్లాస్టింగ్ చేసి స్థలాన్ని చదును చేసేందుకు శనివారం స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు. బ్లాస్టింగ్ విషయమై చుట్టుపక్కల గ్రామస్తులకు సమాచారం అందించకపోవడం, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో భారీగా జరిపిన బ్లాస్టింగ్ లో నిక్షిత్ అనే బాలుడు దుర్మరణం చెందాడు.

రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మంగలి నరేష్ తన చిన్న కుమారుడు నిక్షిత్ తో కలిసి పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ సమీపంలో ఉన్న చిన్నపాటి హోటల్ వద్ద తండ్రీకొడుకులు ఉండగా ఒక్కసారిగా బ్లాస్టింగ్ తో దూసుకు వచ్చిన రాయి నిక్షిప్తలకు బలంగా తగలడంతో ఆ బాలుడి తల పూర్తిగా చింద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. భారీగా పేలుళ్లతో ఒక్కసారిగా గ్రామమే ఉలిక్కిపడింది సమాచారం తెలిసిన వెంటనే వనపర్తి డిఎస్పి అనంతరెడ్డి, తాసిల్దార్ శ్రీరాములు, ఎస్ఐ శివకుమార్ తదితరులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.