ఏకాగ్రత తో విద్యారంగంలో రాణించవచ్చు....

ఏకాగ్రత తో విద్యారంగంలో రాణించవచ్చు....

వ్యక్తిత్వ వికాస నిపుణులు బొట్ల రామస్వామి

చొప్పదండి: విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఏకాగ్రతను అలవర్చుకుంటే సాధ్యమవుతుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బొట్ల రామస్వామి అన్నారు.ఈ మేరకు చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ ఎల్ స్వాతి అధ్యక్షతన ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు  ఉపాధ్యాయులు తమకు విద్యను అందిస్తున్నప్పుడు చెప్పే పాఠము ఏకాగ్రతతో విద్యార్థులు ఎలాంటి ఆలోచన మనసులో లేకుండా వింటే సులువుగా అర్థం అవుతుందని అన్నారు. కొందరు విద్యార్థులు పరీక్షలు అంటే భయపడతారని ఆ భయముతోనే చదువుకున్న విషయాలను మర్చిపోతారని తెలిపారు.

ప్రతి విషయాన్ని భయంతో కాకుండా ఆలోచనతో వివేకంతో, విజ్ఞానంతో సానుకూలంగా ఆలోచించి ముందడుగు వేస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు  వేసిన వారు అవుతారని అన్నారు. నేర్చుకోవాలని కుతూహలం ఉంటే తప్పకుండా సాధిస్తారని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదువును నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పే విషయాలను నేర్చుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరును తీసుకొని రావాలని తెలియజేశారు సమయాన్ని వృధా చేయవద్దని గడిచిన కాలం తిరిగి సంపాదించలేమని విద్యార్థులకు సూచించారు.ప్రతి విద్యార్థి పకడ్బందీగా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళితే రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో గుర్తింపును పొందవచ్చని అన్నారు. విద్యతోపాటు అన్ని రంగాలలో విద్యార్థులు ముందు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గురుకుల వైస్ ప్రిన్సిపల్ అలివేల దీప్తి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.