ఖానాపూర్ లో యువతి దారుణ హత్య

ఖానాపూర్ లో యువతి దారుణ హత్య
  • నడిరోడ్డుపైన అతి కిరాతంగా నరికి చంపిన వైనం
  • మరో ఇద్దరికి గాయాలు
  • ప్రేమ వ్యవహారమే కారణం

ఖానాపూర్, ముద్ర : ప్రేమ వ్యవహారం ఒకరి ప్రాణాలు బలితిసుకుంది. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయo  అయిన విషయం తెలిసి ప్రేమికుడు దారుణానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజినగర్ లో గురువారం పట్టపగలు దారుణ ఘటన జరిగింది. నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...పట్టణం లోని అంబేద్కర్ నగర్ కు చెందిన అలేఖ్య (23) ను అదే వీధికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. అలేఖ్య టైలరింగ్ పని నేర్చుకుంటుంది. యధావిధిగా గురువారం టైలరింగ్ పని చేసుకొని, తన వదిన జయశీల ఆమె మూడు సంవత్సరాలు కుమారుడు రియాంశ్ తో కలిసి వెళుతుండగా శివాజినగర్ లో మాటు వేసి ఉన్న శ్రీకాంత్ (27) అనే వ్యక్తి ఆకస్మికంగా ఒక్కసారి వారి పై గొడ్డలి తో దాడి చేసాడు. దీనితో వారు ఒక్కసారి ఆందోళనకు గురైన్నారు. వారు తేరుకొనే లోపు నిందితుడు శ్రీకాంత్ అలేఖ్య తల, మెడ పైన నరికాడు. వెంటనే పక్కనే ఉన్న జయశీల తల పైన నరికాడు. మూడు సంవత్సరాల రియాంశ్ నుదిటి మీద కొట్టాడు. అలేఖ్య అక్కడికక్కడే చనిపోగా, జయశీల తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఇద్దరిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం నిర్మల్ కు పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

ప్రేమ వ్యవహారమే కారణం.

అలేఖ్య ను శ్రీకాంత్ ప్రేమిస్తున్నాడు. అలేఖ్య కు ఈ మధ్యనే వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం అయింది. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. కాగా వీరిద్దరు అంబేద్కర్ నగర్ కాలనీ వాసులే.