భద్రాద్రిలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

భద్రాద్రిలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రికి భక్తజనం పోటెత్తారు. సీతారాముల కల్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మిథిలా స్టేడియంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగగా.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను మంత్రి సమర్పించారు. ఏటా జరిగే ఈ వేడుకలు ఈసారి మాత్రం భిన్నంగా జరుగుతున్నాయి.  సీతారాముల విగ్రహాలను ఈ ఏడాది సువర్ణ ద్వాదశ వాహనాలపై ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ వాహనంలో స్వామి వారిని ఊరేగించేవారు. ఇటీవల ఆ వాహనాలకు మరమ్మతులు పూర్తిచేయడంతో వేదపండితులు తిరిగి ఆ క్రతువును ప్రారంభించారు. స్వామి వారి కల్యాణం కోసం మిథిలా స్టేడియాన్ని 26 సెక్టార్లుగా మార్చిన అధికారులు.. సుమారు 70 కి పైగా తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేశారు. కాగా, కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని పురవీధుల్లో ఊరేగించగా.. ప్రజలు దర్శించుకున్నారు. మరోవైపు, హైదరాబాద్‌ లో శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా ఉదయం 11 నుంచి రాత్రి వరకు ఆంక్షలు విధించారు.