బోనకల్లుకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

బోనకల్లుకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం 11.40 గంటలకు హెలికాప్టర్ లో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కు చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో జరిగిన పంట నష్టం గురించి తెలుసుకుంటూ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలీప్యాడ్ వద్ద పంట నష్టం పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించారు. అకాల వడగళ్ల వర్షాలతో రైతులకు జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పర్యటించి అంచనా వేసేందుకు, రైతులకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నాలుగు  జిల్లాల పర్యటనలో భాగంగా ఇక్కడ చేరుకున్నారు. బోనకల్ మండలంలోని రామాపురంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాల కారణంగా మొక్క జొన్న పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికంగా ఈ మండలంలో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో సీఎం ఈ మండలం పరిశీలించేందుకు వచ్చారు. ముఖ్యమంత్రి వెంట జిల్లాకు సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రవిచంద్ర, జడ్పీ చైర్మన్ కమల్ రాజు, ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్ తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ దగ్గరుండి సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలువురు బిజెపి, కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. కొంత మందిని గృహ నిర్బంధం చేశారు.