ప్రధాని పర్యటనను నిరసించండి- సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని 

ప్రధాని పర్యటనను నిరసించండి- సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని 

బండి సంజయ్ టెర్రరిస్టుకంటే ప్రమాదం

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రం పట్ల వివక్షత చూపుతూ తెలంగాణ సిరుల తల్లిగా పేరొందిన సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తున్న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను భారత కమ్యూనిస్టు పార్టీ నిరసిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణలో బొగ్గుగనులను ప్రైవేటీకరణ చేస్తున్న మోదీ బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలో బొగ్గు నిక్షేపాలను కోలిండియాకు అప్పగించారని ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయక పోగా ప్రధాని స్థాయిలో మోదీ అడ్డాలు చెబుతున్నారని 

కూనంనేని మండిపడ్డారు. కోయగూడెం ఓ.సి.ని అరవిందో కంపెనీకి అప్పగించారన్నారు. గతంలో మోదీ వచ్చినప్పుడు సైతం రాష్ట్ర సమస్యలను పరిష్కారించాలని ర్యాలీ నిర్వహించామని ఆయన మోదీ వైకరి మారక పోవడంతో ఇప్పుడు ప్రధాని పర్యటనను నిరసిస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఒక ఐ.ఎ.ఎం., ఐ.ఐ.టి, మెడికల్ కాలేజి ఇవ్వని మోది ఈనెల 8న హైదరాబాదు పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా కార్యక్రమాలను చేపడతామన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ టెర్రరిస్తు కంటే ప్రమాదమని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చలగాటమాడేందుకు ప్రయత్నించిన బండి సంజయ్ క్షమించరాని నేరం చేశాడని సాంబశివరావు ఆరోపించారు. టి.ఎస్.పి.ఎస్. ప్రశ్నా పత్రం లీకేజీకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి ఎవరు? ఆయనకీ బీజేపీ ఉన్న లింక్ ఏమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. టి.ఎస్.పి.ఎస్.సి. ప్రశ్నాపత్రాల లీకేజికి సంబంధించి చైర్మెన్ జనార్ధన్ రెడ్డి ని విధుల నుంచి తొలగించాలని సి.పి.ఐ డిమాండ్ చేసిందని మొత్తం లీకేజి వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. 30 లక్షలమంది జీవితాలకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునావృత్తం కాకుండా చూడాలన్నారు.

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు పార్లమెంట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగులుతాయని, ఇవి పార్లమెంటుకు చీకటిరోజులని సాంబశివరావు తెలిపారు. అదాని 13 లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించి ప్రతిపక్షాలు నిలదీయడంతోపాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేస్తుంటే దానికి సమాదానం చెప్పకపోగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్థిక అరాచక వాదులు బీజేపీ చేరగాని పునీతులవుతున్నారని 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసిన వారిపై ఇంతవరకు బీజేపీ ఎటువంటి చర్య తీసుకోలేదని సాంబశివరావు తెలిపారు. బీజేపీలో ఉంటే కేసులుండవని విపక్షాల్లో వుంటే ఈ.డి., సి.బి.ఐ లాంటి సంస్థలకు తప్పులు కనిపిస్తున్నాయని సాంబశివరావు తెలిపారు.

దేశ వ్యాపితంగా 3 వేలకు పైగా కేసులను ఈ డీ నమోదు చేసిందని అందులో 800 కేసులకు సంబంధించి చార్జిషీట్స్ వేశారని 1, 2 శాతానికి మించి శిక్షలు వేయించలేక పోయారని ఆయన తెలిపారు. బీజేపీలో ఉంటే అవినీతిపరులు కారాని, బీజేపీ ఉన్న అవినీతిపరులపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని కూనంనేని ప్రశ్నించారు.

తెలంగాణా లో పోరాడేది మేమే...

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని సాంశివరావు తెలిపారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు రైతులు యువత సమస్య పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నార్నారు. రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ జి..ఓ నెంబర్ 58 ద్వారా రెగ్యురైజ్ చేసి పట్టాలివ్వాలని, ఇంటికి రూ.5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు పోడు భూములకు పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి రంగాలపై దృష్టి సారించాలన్నారు. వామపక్ష సమిష్టి కార్యాచరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. భవిష్యత్ లో వామ పక్షాల ఐక్యతను మరింత పెంపొందించేందుకు క్షేత్ర స్థాయివరకు సమావేశాలు నిర్వహిస్తామని సంయుక్త సమావేశం ఈ నెల 9న హైదరాబాదులో జరుగుతుందని సాంబశివరావు తెలిపారు. మీడియా సమావేశంలో సి.పి.ఐ. సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పాటు ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు జితేందర్ రెడ్డి, ఎస్.కె.జానిమియా పాల్గొన్నారు.