ఇంటికో ఉద్యోగం కాదు..  ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు

ఇంటికో ఉద్యోగం కాదు..  ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు
  • పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి
  • ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ
  • హాజరైన కాంగ్రెస్ అగ్ర నేతలు

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల సమయంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి.. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నగర రోడ్లన్నీ కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీల తో నిండిపోయాయి. ఇల్లేందు క్రాస్ రోడ్డు  నుండి పాత బస్ స్టాండ్ వరకు  జరిగిన  ఈ ర్యాలీలో  రేవంత్ పాదయాత్ర గా వచ్చారు. అనంతరం పాత బస్ స్టాండ్ వద్ద  కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు.  50 లక్షల మంది నిరుద్యోగులతో కేసీఆర్ కుటుంబం చేలగాటం ఆడిందని మండిపడ్డారు.  వారందరికీ భరోసా కల్పించేందుకు అక్క రేణుక చౌదరి   సోదరుడు భట్టి విక్రమార్క సహకారంతో ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టామని ఇది విజయవంతమైందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచి ప్రారంభమైందని ప్రేమ అయినా కోపమైన ఎక్కువ అని రానున్న  ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలిపిస్తే రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటామన్నారు. పోడు  భూములు రైతు సమస్యలు ఇతర ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టులు పోరాటం చేశారని ఇప్పుడు వారు ఎవరి  పక్కన ఉన్నారో  ప్రజలు గమనించాలని రేవంత్ కోరారు.  ఎంత చదివిన ఉద్యోగం రాదని మనస్థాపo తో ఖమ్మం జిల్లాకు చెందిన ముత్యాల సాగర్  అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పరామర్శకు వచ్చిన సమయంలో వారి కుటుంబాన్ని చూసి తనకు దుఃఖం ఆగలేదన్నారు. 10, 12వ తరగతి టీఎస్పీఎస్సీ ఏ పేపర్ అయినా కూరగాయలు, టీ షాపులు వద్ద ఆఖరికి మద్యం బెల్ట్ షాపుల వద్ద కూడా అమ్మకాలు జరుగుతున్నాయని కేసీఆర్ ప్రభుత్వ పాలన ను  రేవంత్ ఎద్దేవ చేశారు.  కేవలం పంపకాల్లో తేడా వచ్చి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందనే  విషయం తెలిసిందేనని ఇది కూడా తామే పట్టుకున్నామని  కెసిఆర్ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. 

మేం నిలదీస్తే విచారణ అధికారులు మాకు నోటీసులు ఇచ్చారని , కొడుకును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటే కేసీఆర్ నాకు నోటీసులు పంపిండని, నాపై ఇప్పటికే..130 కేసులు పెట్టినవ్ కేసీఆర్... ఇంతకంటే ఇంకేం చేస్తావ్ అని రేవంత్ ప్రశ్నించారు.  2014లో ఒకటి 2018 ఎన్నికల్లో ఒక అసెంబ్లీ సీటు మాత్రమే బి(టి)ఆర్ఎస్ గెలిచిందని రానున్న ఎన్నికల్లో ఒంటి కన్ను శివరాసన్ ను  కూడా ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు.  ఖమ్మం సభ స్పూర్తితో ఆదిలాబాద్, నల్గొండ, పాలమూరు చివరకు హైదరాబాద్ సరూర్ నగర్  సభతో ముగిస్తామన్నారు.  మే మొదటి వారం లో సరూర్ నగర్  సభకు ఇందిరాగాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ వస్తున్నారని రేవంత్ తెలిపారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ  మొదటి ఖమ్మం సభ సక్సెస్ అయిన విషయాన్ని ఢిల్లీ కి వెళ్లి  సోనియా,  ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

 సభలో కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి మాట్లాడుతూ ఆడవాళ్లకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ కు  ఉందన్నారు.  కాంగ్రెస్ గుర్తు అయిన  చేతితో కెసిఆర్ బండి గాలి  తీయాలని, మోడీ కమలాన్ని తొలగించాలన్నారు.  నేను ఎప్పుడు ఖమ్మం వచ్చిన పోలీసులు ఆంక్షలు  పెడుతున్నారని, ఇవి చేతి గాజులు కావని  విష్ణు చక్రాలని మంత్రి అజయ్ కుమార్ గుర్తుంచుకోవాలని రేణుక తెలిపారు.  కాంగ్రెస్ నాయకులు వి. హనుమంతరావు, సంబాని చంద్రశేఖర్,  షబ్బీర్ అలీ, మల్లు రవి, వెం నరేందర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు ఎమ్మెల్యే వీరయ్య, బలరాం నాయక్, అంజన్ రాజు, రాజయ్య,  రాముల నాయక్, పోట్ల నాగేశ్వర రావు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్ మురి  వెంకట్, మానవతా రాయ్ , జావీద్ తదితరులు పాల్గొన్నారు.