ఖమ్మం కొత్త కలెక్టరేట్ ప్రారంభం

ఖమ్మం కొత్త కలెక్టరేట్ ప్రారంభం
Inauguration of Khammam new collectorate
  • హాజరైన సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు
  • రాష్ట్ర వ్యాప్త రెండో విడత కంటి వెలుగు ప్రారంభం
  • హాజరైన కాంగ్రెస్ నేత భట్టి

ఖమ్మం, ముద్ర ప్రతినిధి : అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఒకటే చోట ఉండాలని ఉద్దేశంతో ఖమ్మం నగరం శివారు వివి పాలెం జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం రూ.53.20 కోట్ల నిధులతో 20.10 ఎకరాల విస్తీర్ణంలో జి ప్లస్ 2 పద్దతిలో భవన నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభించారు. కెసిఆర్ వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఉన్నారు. నూతన కలెక్టరేట్ నిర్మాణం తీరును కేసీఆర్ వివరించారు. కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆవిష్కరించారు. కలెక్టర్ గౌతమ్ ను ఆయన సీట్లకు కూర్చోబెట్టి సీఎం కేసీఆర్ సహా ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

రెండో విడత కంటి వెలుగు ప్రారంభం: 

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా కలెక్టరేట్లోనే సీఎం కెసిఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కంటి వెలుగు కార్యక్రమం తీరును వివరించారు. లబ్ధిదారులకు ముఖ్య ఆహ్వానితులు  కళ్ళజోళ్ళు అందజేశారు, బ్రోచర్ని ఆవిష్కరించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు,  ఎంపీలు కేశవరావు,  నామ నాగేశ్వరావు, వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి,  రాముల నాయక్, సండ్ర వెంకట వీరయ్య,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పలువురు మంత్రులను కెసిఆర్ పరిచయం చేశారు.