సైకిల్ పై పర్యటించిన మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్

సైకిల్ పై పర్యటించిన మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: నాడు గత పాలకుల హయాంలో గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను బి ఆర్ ఎస్  ప్రభుత్వo  వచ్చాక సీతాకోక చిలుకలా మర్చుకున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. సోమవారం ఖమ్మం నగరం లో వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్  గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ ఆధికారులతో కలిసి సైకిల్​పై పర్యటించారు. నగర వీధుల్లో తిరుగుతూ.. పారిశుధ్యం, విద్యుత్ స్తంభాలు, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్ బోర్లు, డివైడర్లు, సెంట్రల్ డివైడర్లలో ఉన్న మొక్కలు, మురుగు కాల్వలు పరిశీలించి అక్కడ అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు. సుమారు రెండు గంటల పాటు ఆయన  పర్యటించారు. రోడ్లు, మురుగు కాలువలు, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..  ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వారు నివేదించిన సమస్యలను, చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల గూర్చి స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు సైకిల్ పై పర్యటిస్తున్నట్లు  మంత్రి తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో ప్రజలకు సరైన రీతిలో మౌళిక వసతులు అందుతున్నాయని, అందుకు ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నామని వివరించారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నగరంలో త్రాగునీటి సమస్యను పూర్తిగా అధిగమించామని స్పష్టం చేశారు. మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు , అధికారులు ఉన్నారు.