బోల్తా శంకర్‌

బోల్తా శంకర్‌

టైటిల్‌: భోళాశంక‌ర్‌
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
దర్శకుడు: మెహ‌ర్ ర‌మేష్‌
నటీనటులు: చిరంజీవి, త‌మ‌న్నా, కీర్తిసురేష్, సుశాంత్‌, ర‌ఘుబాబు, ముర‌ళీశ‌ర్మ‌, ర‌విశంక‌ర్‌, వెన్నెల కిషోర్‌, తుల‌సి, శ్రీముఖి, ర‌ష్మి గౌత‌మ్ త‌దిత‌రులు
యాక్ష‌న్‌: రామ్ – ల‌క్ష్మ‌ణ్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
సినిమాటోగ్ర‌ఫీ: డూడ్లి
మ్యూజిక్‌: మ‌హ‌తి సాగ‌ర్‌
రిలీజ్ డేట్‌: ఆగ‌స్టు 11, 2023
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

భోళాశంక‌ర్‌ ప‌రిచ‌యం:

మెగాస్టార్ వ‌రుస‌పెట్టి సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నారు. గ‌తేడాది ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్‌, ఈ యేడాది సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌.. ఇక ఇప్పుడు భోళాశంక‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కాకపోతే ఎక్కువ శాతం అన్నీ రీమేక్‌ సినిమాలే అవ్వడం ముందుగా ప్రేక్షకులకి కాస్త నిరాశగానే ఉంది. అయితే భోళాశంక‌ర్ సినిమాపై మ‌రి అంత హైప్ లేదు. దీనికి కార‌ణం ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం త‌మిళంలో అజిత్ హీరోగా వ‌చ్చిన వేదాళం అనే ఊర‌మాస్ సినిమాకు రీమేక్‌గా ఇది తెర‌కెక్కింది. పైగా ఇండస్ట్రీ  బ్లాక్‌బస్టర్‌ డిజాస్ట‌ర్లు ఇచ్చిన మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. అయినా మాస్ ఎలిమెంట్స్ ఏమైనా క్లిక్ అవుతాయేమో అన్న ఆశ‌ల‌తో పాటు మెహ‌ర్ స్టైలిష్ టేకింగ్ ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డైనా క‌నెక్ట్ అవుతుందా ? అన్న ఆశ‌లు కూడా ఉన్నాయి. మ‌రి ఇలా ఆశ‌, నిరాశ‌ల నేప‌థ్యంలో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం ఈ సినిమా ఎలా ఉందో  ముద్ర స‌మీక్ష‌లో చూద్దాం...

కథ :
 శంక‌ర్ ( చిరంజీవి) త‌న చెల్లి మ‌హాల‌క్ష్మి కీర్తి సురేష్‌ను తీసుకుని క‌ల‌క‌త్తా కాలేజ్‌లో ఆర్ట్స్ కోర్సులో చేర్పించేందుకు అక్క‌డ‌కు వెళ‌తారు. అక్క‌డ‌ వ‌రుస‌గా అమ్మాయిల కిడ్నాప్‌లు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ లాయ‌ర్ లాస్య ( త‌మ‌న్నా ) కోసం ఓ అబద్ధ‌పు సాక్ష్యం చెప్ప‌బోయి ఆమెకే టార్గెట్ అవుతాడు. ఈ క్ర‌మంలోనే మ‌హాల‌క్ష్మిని లాస్య అన్న శేఖ‌ర్ ( సుశాంత్ ) ప్రేమిస్తాడు. ఈ క్ర‌మంలోనే శంక‌ర్ విల‌న్ల‌ను ఊచ‌కోత కోసి చంపేస్తుండ‌గా లాస్య చూసి షాక్ అవుతుంది. దీంతో శంక‌ర్ లాస్య‌కు త‌న‌తో పాటు మ‌హాల‌క్ష్మి గ‌తం చెపుతాడు. అస‌లు మ‌హాల‌క్ష్మి ఎవ‌రు ? ఆమెకు శంక‌ర్‌కు ఉన్న సంబంధం ఏంటి ? ఆ అమ్మాయిల కిడ్నాప్ ముఠా వెన‌క ఉన్న సూత్ర‌ధారి ఎవ‌రు ? దీనిని శంక‌ర్ ఎలా చేధించాడు ? అన్న‌దే  ఈ చిత్ర కథాంశం.

విశ్లేషణ :
కథ మొదలైన 30 నిమిషాల వ‌ర‌కు అస్స‌లు ఒక్క సీన్‌కూడా ప్రేక్షకుడికి ఇంట్రస్టింగ్‌గా అనిపించదు. దాన్ని బట్టే  మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ ఎలా స్టార్ట్ అయ్యిందో అర్థ‌మ‌వుతుంది. ఇక క‌థే 1970ల నాటి కాలంలో ఉంది అనుకుంటే.. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ 1980 కాలంలో ఉంది. అస‌లు డైలాగులు చాలా సాధాసీధాగా ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో వచ్చే చిత్రాల్లో పంచ్‌డైలాగులకు బాగా అలవాటు పడ్డ ప్రేక్షకుడికి పెద్దగా నచ్చవు.  సీన్లు కూడా ప‌ర‌మ రొటీన్‌గా ఉన్నాయి. అస‌లు త‌మ‌న్నా ఫ‌స్ట్ కోర్టు సీన్ కూడా చాలా పేల‌వంగా ఉంది. చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చాడంటే దానిని ఎంతో బాగా యూజ్ చేసుకోవ‌చ్చు. కానీ మెహ‌ర్ ర‌మేష్ ప‌దేళ్ల త‌ర్వాత ఛాన్స్ వ‌చ్చినా కూడా ఏ మాత్రం మారలేదు.  అదే స్టైల్‌.. అదే విధానం.

అస‌లు సినిమా మొత్తం మీద భూతద్దం పెట్టి వెతికినా ఒక సీన్‌ కూడా మంచిగా క‌నిపించ లేదంటే క‌థ‌, క‌థ‌నాలు, డైరెక్ష‌న్ ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుస్తోంది. ఏ సినిమాకు అయినా బెనిఫిట్ షోకు ఫ్యాన్స్ సినిమాలో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీనో లేదా ఫైటింగ్ సీన్లో వీడియోలు తీసి స్టేట‌స్‌లు పెట్టుకుంటారు. అంత మెస్మ‌రేజ్ చేసేంత గొప్ప సీన్లు ఒక‌టి రెండు వెతుక్కునేందుకు కూడా ఫ్యాన్స్ క‌ష్ట‌ప‌డ్డారు అంటే మెహ‌ర్ ర‌మేష్ డిజాస్ట‌ర్ టేకింగ్ ఎంత చెత్త‌గా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక ఇంట‌ర్వెల్ సీన్ కూడా మెహ‌ర్ డిజాస్ట‌ర్ మూవీ షాడోను గుర్తు చేస్తుంది. సెకండాఫ్‌లో శ్రీముఖితో కొన్ని సీన్లు ఉంటాయి అవి కాస్త హాస్యస్పదంగా ఉంటాయి. అదేమైనా క్లిక్ అయితే సినిమా మ‌రీ త‌న్నేయ‌కుండా కొంత వ‌ర‌కు నిల‌బ‌డ‌వ‌చ్చు. క్లైమాక్స్ కూడా ప‌ర‌మ రొటీనే అయ్యింది. న‌టీన‌టుల్లో మెగాస్టార్ చిరంజీవి యాక్ష‌న్ కంటే కూడా సెకండాఫ్‌లో చేసిన కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. చిరు ఏజ్ పైబ‌డిన చాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపించినా డ్యూడ్లీ సినిమాటోగ్ర‌ఫీ మాయ‌తో బాగానే మ్యానేజ్ చేశాడు. ఈ వ‌య‌స్సులోనూ చిరు ఏజ్ త‌గ్గించి చూపించేందుకు బాగా శ్ర‌మ‌ప‌డ్డారు. ఇక చిరు డాన్స్‌ విషయానికి వస్తే ఎందుకో బాడీని కదల్లేక కదిపినట్లుగా అనిపించింది. కానీ ఎక్కడా డాన్స్‌ పరంగా కూడా పెద్దగా మెప్పించలేకపోయారు. న‌ట‌నా ప‌రంగా చిరు నుంచి కొత్త‌గా ఆశించ‌డానికేం లేదు. ఇక హీరోయిన్ త‌మ‌న్నా కొన్ని సీన్లు పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మైంది. లాయ‌ర్‌ లాస్య‌గా ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్ల‌లో త‌ళుక్కుమ‌న్నా ఆమె అతి చేసిన‌ట్టుగా ఉంది. ఇక చిరు చెల్లి పాత్ర‌లో కీర్తి సురేష్ పాత్ర‌కు బాగానే ప్రాధాన్యం ద‌క్కింది. ఇంకా చెప్పాలంటే త‌మ‌న్నా కంటే కూడా కీర్తి సురేష్ పాత్ర ఫ‌స్టాఫ్‌లోనూ.. సెకండాఫ్‌లోనూ చిరుతో కీర్తి పాత్ర ఎక్కువగా ట్రావెల్ అయింది.

సుశాంత్ పాత్రకు స్కోప్ లేదు. తెర‌నిండా చాలా మంది న‌టులు ఉన్నా ఎవ్వ‌రికి  పెద్దగా ప్రాధాన్య‌త లేదు. సెకండాఫ్‌లో ర‌ష్మీ రెండు సీన్లు ఓ సాంగ్‌లో కాస్త హాట్‌గా మెరిసింది. హాట్ యాంక‌ర్ శ్రీముఖి కీర్తి సురేష్ ఫ్రెండ్‌గా చిరును క‌వ్వించే పాత్ర‌లో క‌నిపించింది. శ్రీముఖి – చిరు ఖుషి బొడ్డు సీను బాగా రిపీట్ చేశారు. ఇక తుల‌సి, ముర‌ళీశర్మ‌, సురేఖ‌వాణి, ర‌ఘుబాబు పాత్ర‌ల‌తో తెర‌మీద క‌నిపించారు. ఇక మెయిన్ విల‌న్‌గా చేసిన త‌రుణ్ అరోరా సెకండాఫ్ స‌గం అయ్యే వ‌ర‌కు కూడా పూర్తిగా ఎంట‌ర్ కాలేదు. ఫ‌స్టాఫ్‌లో ఫోన్ సీన్ల‌కే ప‌రిమితం. మెయిన్ విల‌న్ త‌రుణ్ అరోరా కంటే కొస‌రు విల‌న్ల‌న‌కే కాస్త తెర‌మీద ప్రాధాన్యం ద‌క్కింది.

టెక్నిక‌ల్‌గా వ్యాల్యూస్‌
ఇక టెక్నిక‌ల్‌గా డూడ్లీ సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. త‌మ‌న్నా, కీర్తి సురేష్‌, శ్రీముఖి, చిరంజీవిని అందంగా చూపించేందుకు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమా అంతా క్లోజ‌ప్ షాట్‌లే కావ‌డంతో కెమేరామెన్‌కు పెద్ద క‌ష్టం కూడా లేదు. రామ్ ల‌క్ష్మ‌న్ ఫైట్లు కొంచం కొత్తగా అనిపించాయి.  ఇక మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి సాగ‌ర్ ఆల్బమ్ ఇప్ప‌టికే తేలిపోయింది. పాట‌లు క్లిక్ కాలేదు. అనుకున్న స్థాయిలో ఒక్క పాట కూడా లేదు. కనీసం మ్యూజిక్‌ క్లిక్‌ అయినా పాటల కోసమైన సినిమాకి వెళ్ళేవారు. అయితే త‌మన్నా సాంగ్ మాత్రం తెర‌మీద బాగుంది.  సినిమా మేకింగ్ ఖ‌ర్చు కంటే రెమ్యున‌రేష‌న్లే ఖ‌చ్చితంగా ఎక్కువ‌ని క్లీయ‌ర్‌గా తెలిసిపోతోంది.

ఇక ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ త‌మిళ వేదాళం మెయిన్ లైన్ తీసుకుని ఇక్క‌డ చిరు క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌కు అనుగుణంగా మార్పులు అయితే చేశాడు. బ‌ట్ రాసిన రాత‌.. తీసిన తీత పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి క‌న్నా మిన్న‌గా బూజుప‌ట్టిపోయిన‌ట్టుగా ఉన్నాయి. 1970 – 1980ల నాటి క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమా తీసేశాడు. అస‌లు ఫ‌స్టాఫ్ అయితే చాలా బోరింగ్ అనిపిస్తుంది. ప్రేక్షకుడు ఎప్పుడైతే బోర్‌ ఫీలవుతాడో అప్పుడే సినిమా పోయినట్టే అని చెప్పొచ్చు.  గ‌ట్టిగా నాలుగైదు సీన్ల‌లో చిరు ఎలివేష‌న్లు త‌ప్పా ఏం లేదు.


టోట‌ల్ మూవీ : వ‌ర‌స్ట్ డైరెక్ష‌న్‌
ఫ‌స్టాఫ్‌ : ప‌ర‌మ చెత్త స్క్రీన్ ప్లే, ఇరిటేటింగ్ సీన్లు

ఫైన‌ల్‌గా…
భోళాశంక‌ర్ ఓ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇలాంటి సినిమాలు గ‌త 20 – 30 ఏళ్ల నుంచే తెలుగులో ఎన్నోసార్లు చూసేశాం. త‌న చెల్లికి జ‌రిగిన అన్యాయంపై రివేంజ్ తీర్చుకునే స్టోరీలు మ‌న‌కు కొత్త కాదు. పోనీ అంత‌కు మించి ఈ సినిమాలో కొత్త‌ద‌నం లేదు. క‌థే పాత‌ది అనుకుంటే క‌థ‌నం కూడా అలాగే ఉంది. 

భోళాశంక‌ర్‌ ఫైన‌ల్ పంచ్ : బోల్తా శంక‌ర్‌