మాజీ మంత్రి అల్లోల చేరిక యత్నాలపై నిరసన సెగలు 

మాజీ మంత్రి అల్లోల చేరిక యత్నాలపై నిరసన సెగలు 

- వివిధ మండలాల్లో కార్యకర్తల నిరసన సమావేశాలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవలి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఓటమి చవిచూసిన మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్న వార్తలు నిలబడుతున్న నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తూ ఇంద్రకరణ్ రెడ్డి చేరికను అనుమతించరాదని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాల్లో ఇంద్రకరణ్ రెడ్డి తీరును దుయ్యబడుతున్నారు. గత పదేళ్లలో ఎక్కడికక్కడ చెరువుల భూములు ఆక్రమించుకొని, డి1 పట్టాలు చేసుకుని అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్న భూములను కాపాడుకునేందుకే కాంగ్రెస్ లో  చేరేందుకు ఎత్తుగడ పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాగా గత 30  ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ మారిన ఇంద్రకరణ్ రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనన్నారు. ఉదయం ఒక చొక్కా, సాయంత్రం మరో చొక్కా మార్చినట్లు పార్టీలు మార్చడం ఆయనకు అలవాటైందని దుమ్మెత్తి పోస్తున్నారు. గత దశాబ్ద కాలంగా గుడులను, గుళ్ళల్లో లింగాలను మింగేసిన చందంగా ఆయన వ్యవహరించిన తీరు ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. చిన్న వర్షం పడితే రోడ్లపై నీరు నిలిచి సాక్షాత్తు జెడ్పి చైర్ పర్సన్ రోడ్లపై నిలబడి డివైడర్లను కూల్చేసిన చరిత్ర ఇంద్రకరణ్ రెడ్డిదని అన్నారు. మునిసిపాలిటీలో ఉద్యోగాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్న నీతి చరిత్ర ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చడమేనన్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దంటూ డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు పంపించనున్నట్లు కార్యకర్తలు స్పష్టం చేశారు.