ఢిల్లీకి రండి - అమిత్​షా వీడియోపై రేవంత్​కు పోలీసుల నోటీస్​

ఢిల్లీకి రండి - అమిత్​షా వీడియోపై రేవంత్​కు పోలీసుల నోటీస్​
  • కాంగ్రెస్, బీజేపీల మధ్య రిజర్వేషన్ల చిచ్చు
  • రిజర్వేషన్లు రద్దు చేస్తామని షా చెప్పినట్లు వీడియో వైరల్ చేసిన కాంగ్రెస్
  • కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో రంగంలోకి ఢిల్లీ పోలీసులు
  • రేవంత్ కు, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జి మన్నె సతీశ్ కు సమన్లు జారీ
  • వచ్చే నెల 1న విచారణకు రావాలని ఆదేశాలు జారీ
  • రాష్ట్ర రాజకీయాలను షేక్  చేస్తున్న వీడియో


ముద్ర, తెలంగాణ బ్యూరో : రిజర్వేషన్ల చిచ్చు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే వివిధ వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించినట్లు విడుదలైన ఓ వీడియోను రాష్ట్ర కాంగ్రెస్  నేతలు వైరల్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజుల క్రితం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మోడీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. 

కాంగ్రెస్​ అధికారిక ట్విట్టర్​లో వీడియో పోస్ట్..

రిజర్వేషన్లపై అమిత్​షా మాట్లాడినట్లున్న వీడియోను తెలంగాణ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అలాగే రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర  కాంగ్రెస్ నేతలు సైతం స్పందించి బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ  వీడియో  ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. రిజర్వేషన్లపై ఆయా వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అయింది. ఈ అంశాన్ని ఇలాగే వదిలేస్తే మరో రెండు వారాల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశముందని భావించింది. వెంటనే రంగంలోకి దిగి వీడియో సంగతి చూడాలని నిర్ణయించింది.  ఈ నేపథ్యంలో వీడియోపై కేంద్ర హోంశాఖ  ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఢిల్లీ పోలీసులు సోమవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్​చార్జికి సమన్లు అందించారు. సీఆర్పీసీ 91 ప్రకారం ఈ నోటీసులు ఇచ్చినట్ల తెలిసింది. మే 1న విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించినట్లుగా సమాచారం. 

ప్రధాని ఆగ్రహం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై కేంద్ర హెంమంత్రిత్వ శాఖ సీరియస్ అయి విచారణకు ఆదేశించడంతో  ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. అసలు ఈ ఫేక్ వీడియో ఎవరు రూపొందించారనే దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తోంది. కాగా ఈఫేక్ వీడియోలపై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

గాంధీభవన్​ నుంచే వీడియో షేరింగ్..!

ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు  వెంటనే విచారణ ప్రారంభించారు. గాంధీ భవన్ నుంచే సోషల్ మీడియాలో వీడియోల షేరింగ్ జరిగిందనిన నిర్ధాణకు వచ్చారు. ఇందులో భాగంగానే సీఆర్పీసీ సెక్షన్ 91కింద కాంగ్రెస్ సోషల్  మీడియా ఇన్ చార్జి మన్నె సతీశ్, శివకుమార్, అస్మా తస్లీమ్ కు నోటీసులు జారీ చేశారు. ఇది ఫేక్ వీడియో అని బీజేపీ, కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 153, 153ఏ, 465, 469, 171జీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  చట్టంలోని సెక్షన్ 66సీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియోను అప్‌లోడ్ చేసిన, షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ పోలీసులు ట్విట్టర్, ఫేస్ బుక్ కు కూడా నోటీసులు కూడా పంపారు. విచారణకు వచ్చే సమయంలో మొబైల్ ఫోన్ కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

నోటీసులకు భయపడం - సీఎం రేవంత్​ రెడ్డి

తనకు వచ్చిన నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఢిల్లీ పోలీసులకు, నోటీసులకు తాను భయపడనన్నారు. బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారన్నారు. బీజేపీని ప్రశ్నించినందుకు తనకు నోటీసులు పంపారని అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు వస్తున్నారని సీఎం మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటకలో బీజేపీని ఓడించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చారని.. మోడీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.

ఇది తెలంగాణ ప్రజలపై దాడి

ఢిల్లీ పోలీసులను బెదిరించి సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చేలా బీజేపీ అధికార దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బెదిరిస్తున్నారన్నారు. రిజర్వేషన్లను ఆపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు తెలంగాణ ప్రజలపై దాడిగా అభివర్ణించారు.