కేంద్రంలో హంగ్​ ఖాయం

కేంద్రంలో హంగ్​ ఖాయం
  • బీజేపీకి 200 ఎంపీ సీట్లు కూడా దాటవు
  • నామా నాగేశ్వర రావు కేంద్ర మంత్రి అవుతారు
  • అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది
  • ఎన్టీఆర్ తోనే రాష్ట్రంలో సంక్షేమం మొదలైంది
  • ఖమ్మం బస్సు యాత్రలో బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​

ఖమ్మం, ముద్ర: పార్లమెంట్​ ఎన్నికల్లో కేంద్రంలో హంగ్​ రావడం ఖాయమని, బీజేపీకి 200 సీట్లు కూడా దాటవని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాత్రి కేసీఆర్​ ఖమ్మం నగరంలో బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వడ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్​ మాట్లాడారు. 

12 సీట్లు గెలుస్తాం..

బీఆర్ఎస్​ బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 సీట్లు గెలుస్తామని కేసీఆర్​ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఖమ్మంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండ ఉన్నా కూడ సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. నామా నాగేశ్వరరావు నాకు ఒక మాట చెప్పారు. ఆయనకు తన జిల్లా, మన రాష్ట్రం బాగుపడాలని కోరిక. పంజాబ్ కంటే ఎక్కువగా మనం ధాన్యం పండించాం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పింది. తెలంగాణ కేబినెట్ మొత్తం వెళ్లి ఢిల్లీ లో ధర్నా చేశాం. నాడు ఒక్క బీజేపీ ఎంపీ కానీ, కాంగ్రెస్ ఎంపీ కానీ ఒక్కరూ నోరు తెరవలేదు. బీజేపీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక కేంద్రమంత్రి ఉన్నరు. ముగ్గురు ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి మాత్రం వారు మాట్లాడలేదు.”అని కేసీఆర్​ మండిపడ్డారు. 

రేవంత్​ లాంటి దద్దమ్మలు అవసరమా..?

సీఎం రేవంత్ రెడ్డి వంటి దద్దమ్మలు మనకు ఎందుకు అని కేసీఆర్​ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా పూర్తి కావాలని దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నిర్మాణం చేశామన్నారు. మోడీ గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటక తీసుకుపోతామని అన్నా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ ఇటువంటి ప్రతి పాదన తెచ్చారని, తమ రాష్ట్రానికి చెందిన నీటిని ముట్టుకునే సమస్య లేదని తెగేసి చెప్పానని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని, ఎంపీగా నామాను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్​ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగే వరకు పోరాటం చేస్తుందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను ఆమరణ దీక్షకు పూనుకుంటే తనను ఖమ్మం తీసుకొచ్చారని, అప్పుడు న్యూడెమోక్రసీ, విద్యార్థి సంఘాలు తనకు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత రాష్ట్రం సాధించి పాలన చేపట్టామని కేసీఆర్​ తెలిపారు.

తులం బంగారం పథకం తుస్సుమంది..

‘రైతులకు 24 గంటలు కరెంట్ కల్పించాం, రైతు పండించిన పంటను కొనుగోలు చేశాం. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పాలన వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ ని మించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.’ అని కేసీఆర్​ ఆరోపించారు. రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకం పెట్టుకున్నామని, అధికారంలో వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కల్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని ఇవ్వలేదని.. తులం బంగారం తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు. రైతు బందు గురించి గురించి అడిగితే నేటి ప్రభుత్వ పెద్దలు చెప్పుతో కొడతామటున్నారని కేసీఆర్​ ఆరోపించారు. ఆయనకు నేను చెప్పేది ఒకటే.. ప్రజలతో పెట్టుకుంటే నాశనం అవుతారని అన్నారు. 

ఆయన భట్టి కాదు.. వట్టి విక్రమార్క..

బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరోజు కరెంట్ పోలేదని, కాంగ్రెస్ వచ్చాక నిత్యం కరెంట్ కోతలే ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాదు, ఆయన వట్టి విక్రమార్క అని కేసీఆర్​ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ కి నీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదని విమర్శించారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదు. రుణమాఫీపై మాజీ మంత్రి హరీశ్​ రాజీనామా చేసిండు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయకుండా పరారైండని కేసీఆర్​ ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని.. తాను ప్రశ్నిస్తే  జైల్లో వేస్తా, కళ్ల గుడ్డు పీకుతా అని బెదిరిస్తున్నారని కేసీఆర్​ పేర్కొన్నారు.