25న నిరుద్యోగ మహా ధర్నా

25న నిరుద్యోగ మహా ధర్నా
  • పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలె
  • కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే..
  • బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్​

ముద్ర, తెలంగాణ బ్యూరో: టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. ‘మా నౌకరీలు మాగ్గావాలె’ నినాదంతో మార్చి 25న ఇందిరాపార్క్ వద్ద  ‘నిరుద్యోగ మహా ధర్నా’ చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నిరుద్యోగ యువతతో కలిసి ధర్నా నిర్వహించనుంది. బుధవారం హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 
జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, లీగల్ సెల్ స్టేట్​లీడర్​ఆంటోనీ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి సంగప్ప తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ అంశాలపై చర్చించారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి మద్దతుగా సాగర హారం, మిలియన్ మార్చ్ తదితన కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. 

పేపర్ లీకేజీలో కేటీఆర్​పాత్ర.. 
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్​పాత్ర ఉందని, వెంటనే ఆయనను బర్తరఫ్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి తెలిపారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నిరుద్యోగ మహాధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియా, యూ ట్యూబ్ ఛానళ్లను బెదిరించడం, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తుండడంతో వారికి మద్దతుగా పోరాడుతామని, ఆయా సంస్థల కార్యాలయాలకు వెళ్లి జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతామని అన్నారు. ఈ సందర్భంగా వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో బండి సంజయ్ ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.

అటుకులు తిని బతికితే.. రూ.వేల కోట్లు ఎలా వచ్చాయి?
గతంలో అటుకులు తిన్న కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని బండి ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే తన దగ్గరున్న సమాచారాన్ని అందజేస్తానని, సిట్ నోటీసులు ఇస్తే భయపడతానా? అని ప్రశ్నించారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా విఫలమైన కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తన కుటుంబం కోసం ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారని విమర్శించారు. పేపర్ లీకేజీపై మాట్లాడిన అనేక మంది మంత్రులకు సిట్ నోటీసులు ఎందుకు జారీ చేయడంలేదని నిలదీశారు. సీఎం బిడ్డ కోసం క్యాబినెట్ అంతా ఢిల్లీలో కూర్చోవటం దారుణమని, 30 లక్షల మంది జీవితాలను కేసీఆర్ సర్కార్ రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ మొదలైందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తామని నిరుద్యోగులకు బండి హామీ ఇచ్చారు.