ప్రజలకు సేవ చేసినందుకా ప్రభుత్వం కూలాలి కెసిఆర్..

ప్రజలకు సేవ చేసినందుకా ప్రభుత్వం కూలాలి కెసిఆర్..
  • భువనగిరి అంటే పోరాటాలకు స్ఫూర్తి..
  •  ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి...
  • నాతోపాటు సీఎం పదవి అర్హత ఉన్న వ్యక్తి వెంకటరెడ్డి..
  • బిఆర్ఎస్ కి ఓటు వేస్తే బీజేపీ చేసినట్టే...

ముద్ర ప్రతినిధి భువనగిరి :  నల్లగొండ, భువనగిరి అంటే పోరాటాల స్ఫూర్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి  ధర్మబిక్షం, కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లి లలిత గుర్తుకు వస్తారని చెప్పారు. సాయిధరైతాంగ పోరాటంతో నైజాం గడగడలాడించిన పోరాటపటిమని గుర్తు చేశారు.  ఆదివారం రాత్రి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భువనగిరిలో  భారీ రోడ్ షో లో పాల్గొని  స్థానిక వినాయక చౌరస్తా వద్ద  భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్ మీటింగ్లో  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏ విధంగా అయితే గెలిపించారో అదే స్ఫూర్తితో చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై కెసిఆర్ చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా విమర్శించారు. 

కమ్యూనిస్టును వాడుకొని దారుణంగా మోసం చేసిన ఘనత కేసిఆర్ ది అన్నారు. దేశంలో మోడీ రాష్ట్రంలో కేడి 10 సంవత్సరాలుగా  ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో కేడిని  ఓడించాం ఇక దేశంలో ఉన్న మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం మన లక్ష్యం అని అన్నారు. 90 రోజులలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదే అన్నారు. ప్రజలకు సేవ చేసినందుకా ప్రభుత్వం కూలాలి అంటున్నావు  కెసిఆర్  అని ప్రశ్నించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నాకు రాజకీయ ప్రాణం పోసింది భువనగిరి ప్రజలేనని అదే స్ఫూర్తితో సామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య మాట్లాడుతూ  భూగోళం ఉన్నంతవరకు  తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే పాలిస్తుంది అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని భువనగిరి అంటే కాంగ్రెస్ అడ్డా అన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్  ఎమ్మెల్యే  వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే  మందుల సామేల్, సిపిఐ నాయకులు  పల్లా వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.