తండ్రి చేతిలో కొడుకు హతం... తండ్రి ఆత్మహత్యాయత్నం

తండ్రి చేతిలో కొడుకు హతం... తండ్రి ఆత్మహత్యాయత్నం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: కుటుంబ కలహాలతో తండ్రి కొడుకు పై దాడి చేయగా కొడుకు మృతి చెంది తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో గురువారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... తాటికొండ గ్రామానికి చెందిన మారపాక రాజయ్య - రాజమ్మలకు కుమారులు ఒక కూతురు ఉన్నారు. చిన్న కొడుకు మారపాక నవీన్ తన పెళ్లి విషయంలో తల్లిదండ్రులతో తరచు గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం వ్యవసాయ బావి వద్ద ఉన్న తండ్రి కొడుకుల మధ్య కుటుంబ విషయంపై గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.

ఊహించని విధంగా నవీన్ తల్లి పై దుర్భాషలాడడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న తండ్రి రాజయ్య చేతికి అందిన గొడ్డలి, గుణపంతో కొడుకు పై దాడి చేశాడు దీంతో నవీన్ తీవ్రంగా గాయపడి క్రింద పడిపోయాడు. చనిపోయాడని భావించిన రాజయ్య భయాందోళనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసిపి రఘు చందర్, రఘునాథపల్లి సిఐ సంతోష్ కుమార్ తీవ్రంగా గాయపడి కొనవపిరితో కొట్టుమిట్టాడుతున్న నవీన్ ను, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న రాజయ్యను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మారపాక నవీన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.