బిఆర్ఎస్ తో పొత్తు ఉంటుంది..! పోరాటము ఉంటుంది..!! 

బిఆర్ఎస్ తో పొత్తు ఉంటుంది..! పోరాటము ఉంటుంది..!! 
  •  మార్చి 17నుండి రాష్ట్రవ్యాప్తంగా సిపియం యాత్ర.. 
  •  బిజేపిని అడ్డుకుంటాం..భారాసకు ప్రజల సమస్యలు వివరిస్తాం 
  •  సిపిఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. 

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: భారాసతో పొత్తు ఉంటుందని.., ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజలపక్షాన నిలిచి రాష్ట్రప్రభుత్వంపైన సిపిఎం పోరాటం ఉంటుందని ఆపార్టీ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  గురువారం ఆయన ప్రసంగించారు.  బిజెపిని అడ్డుకునేందుకు బిఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాలకపక్షమైన భారాసతో పోరాటం కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుందని మార్చి నెలలో 17వ తేదీ నుండి 31వ తేదీ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం పార్టీ యాత్ర కొనసాగుతుందని తమ్మినేని ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఈ యాత్రలో గుర్తించి రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని, అదే సందర్భంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరిని ప్రజలకు వివరిస్తామని తమ్మినేని తెలిపారు.    

ఈయాత్రలో బారతీయజనతాపార్టీని ఎండగడతామని, కార్పోరేట్ శక్తులకు మేలుచేస్తూ ప్రధానమంత్రి మోడీ  ప్రజలపై ఏ విధంగా భారం మోపుతున్నాడో వివరిస్తామన్నారు. కేంద్రప్రభుత్వ విధానాలు ప్రజలకు ఎలా శాపంగా పరిణమించాయో  తెలియజేస్తామని తమ్మినేని అన్నారు. కేంద్రప్రభుత్వం  విభజనచట్టంలోని అన్ని హామీలను అమలు పరచాలని, బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటు అంశంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. బయ్యారం ఖనిజం పరిశ్రమ ఏర్పాటుకు పనికిరాదంటూ చేస్తున్నది తప్పుడు ప్రచారమని, పరిశ్రమ ఏర్పాటుకు బయ్యారం అన్నిరకాలుగా అనువైనదేనని తమ్మినేని తెలిపారు. అదే సందర్భంలో  రాష్ట్రప్రభుత్వ విధాన లోపాలను, ధరణిలో ప్రజల ఇబ్బందులను  రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామన్నారు.

ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు  పట్టాలు ఇవ్వాలని, పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. గిరిజనులతోపాటు గిరిజనేతరులకు కూడా పోడు భూముల పట్టాలు ఇవ్వాలని తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి సూచించారు.  నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి మూడులక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం బావిస్తుందని, మరో రెండులక్షలు పెంచి ఐదు లక్షలరూపాయలు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పొత్తులకు అవకాశం ఉందని , ఇంకా పొత్తులపై చర్చించలేదని తెలిపారు. ఈ..సమావేశంలో సిపిఎం నాయకులు జి నాగయ్య, సాదుల శ్రీనివాస్, సూర్నపు సోమయ్య, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, శెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.