కట్నం వేధింపులే... ఆత్మహత్యకు కారణం

కట్నం వేధింపులే... ఆత్మహత్యకు కారణం
  • ఏసిపి రఘు చందర్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: అదనపు కట్నపు వేధింపులే మహమ్మద్ అఫ్రీన్(24) ఆత్మహత్యకు కారణమైందని ఏసిపి రఘు చందర్ వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోలీసుల కథనం ప్రకారం... స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అరిఫ్ కూతురు అఫ్రీన్ ను చాగల్ గ్రామానికి  చెందిన సమీర్ కు ఇచ్చి గత ఏడాది జూన్ 2న వివాహం చేశారు. వివాహ సందర్భంగా నాలుగున్నర లక్షలు నగదు, 10 తులాల బంగారం, 40 తులాల వెండి, మోటార్ సైకిల్ ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. మూడు నాలుగు నెలలు సాఫీగా సాగిన వారి సంసార జీవితంలో అదనపు కట్నం బీజం వేసుకుంది.

మృతురాలి భర్త సమీర్ అదనపు కట్నం కోసం తరచూ వేధించేవాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పలుమార్లు నచ్చజెప్పి తమ కూతురు అత్తారింటికి పంపారని తెలిపారు. అయినా అదనపు కట్నం వేధింపులు తగ్గకపోవడంతో తల్లి గారి ఇంటికి వచ్చిన అఫ్రీన్ మూడు రోజుల క్రిందట ఇంట్లో నుండి బయటకు వెళ్లి రిజర్వాయర్ లో శనివారం శవమైతెలినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రఘు చందర్ తెలిపారు. ఆయన వెంట సీఐ రాఘవేందర్, ఎస్సై శ్రావణ్ కుమార్ ఉన్నారు.