పెబ్బేర్ మార్కెట్ యార్డ్ లో భారీ అగ్నిప్రమాదం
ముద్ర,పెబ్బేరు (ఏప్రిల్ 01 ): వనపర్తి జిల్లా పెబ్బేరు పట్ణణంలోని మార్కెట్ యార్డు గోదాములో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ అధికారులు ఫైరింజన్లతో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గోదాములు అరలు అరలుగా ఉండటంతో గన్నీ బ్యాగులు ఉన్న గోదాములో మాత్రమే మంటలు అధికంగా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్థానికులు సైతం ట్యాంకర్ల ద్వారా వచ్చిన నీటిని పైపుల ద్వారా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గద్వాల, జడ్చర్ల, ఆత్మకూరు ఫైర్ స్టేఫన్లకు సమాచారం ఇచ్చారు. ఆ వాహనాలు కూడా వస్తే మంటలను త్వరితగతిన అదుపు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గోదాములో మొత్తం 12.80 లక్షల గన్నీ బ్యాగులు ఉండగా అవి పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. వాటి విలువ దాదాపు రూ.10 కోట్ల మేర ఉంటుందని సివిల్ సప్లై అధికారుల నుంచి తెలిసింది. సమాచారం తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ నాగేష్, ఆర్డీవో పద్మావతి, పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, ఎస్సై హరిప్రసాద్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదం ఎలా జరిగందన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారులు సిబ్బంది, లోకల్ గా మున్సిపల్ శాఖ, స్థానిక లీడర్లు ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆత్మకూరు, జడ్చర్ల, గద్వాల నుంచి కూడా ఫైరింజన్లు వస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఎవరైనా కావాలనే చేసి ఉంటారా అని పలువురి నుండి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం లాగా కనిపించడం లేదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రతభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.