ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ముద్ర.వీపనగండ్ల:-అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్ర వెంకటేష్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కల్వరాలలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని చక్ర వెంకటేష్ కోరారు.తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని,ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు,మీ సేవలు, అధికారుల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్ లు తీసుకునే నూతన ఓరవడిని ప్రారంభించామని అన్నారు.

ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలలో ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ని పది లక్షలకు పెంచామని గుర్తు చేశారు. రేషన్ కార్డు లేకపోయినా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, హౌసింగ్ ఏఈ మెహర్ తేజ, పంచాయతీ కార్యదర్శి కురుమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ రాజయ్య, నరసింహ, పెంటయ్య తదితరులు ఉన్నారు.