గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు తొలి అడుగులు బ్రిడ్జిల నిర్మాణ ప్రదేశాల్లో సాయిల్ టెస్టింగ్

గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు తొలి అడుగులు  బ్రిడ్జిల నిర్మాణ ప్రదేశాల్లో సాయిల్ టెస్టింగ్

కేసముద్రం, ముద్ర: నాగపూర్- విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా వరంగల్- ఖమ్మం మధ్య నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. 2,889 కోట్ల  వ్యయంతో వరంగల్ నుంచి ఖమ్మం వరకు సుమారు 108 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించనున్నారు. 2025 నాటికి రోడ్డు నిర్మాణం పూర్తికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే అవసరమైన సర్వే పూర్తి చేసి భూసేకరణ పనులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ మేరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ ప్రెస్ రోడ్డు నిర్మాణం కోసం తొలుత మూడు అలైన్మెంట్లు ప్రతిపాదించగా ఒకటి ఇప్పుడు ఉన్న నేషనల్ హైవే 563 కాగా, మరొకటి 124 కిలోమీటర్ల దూరం ఉన్న అలైన్మెంట్. మరొకటి 108 కిలోమీటర్ల అలైన్మెంట్. గతంలో ఉన్న 563 రహదారిని విస్తరించడానికి భారీగా ఖర్చు చేయడంతో పాటు దూరం అధికంగా ఉండడం, రెండో అలైన్మెంట్లో 10 కిలోమీటర్ల మీద అటవీ భూమి ఉండడంతోపాటు వివిధ నిర్మాణాలు ఉండటంతో పరిహారం పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో రెండు అలైన్మెంట్లను కాదని మూడో అలైన్మెంట్ ఖరారు చేశారు.

మూడో అలైన్మెంట్లో పూర్తిగా వ్యవసాయ భూములు, ఖాళీ ప్రదేశాలు ఉండడంతో  ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా ఎక్కడపడితే అక్కడ ఇతర వాహనాలు వచ్చి చేరడానికి వీల్లేకుండా యాక్సేస్ కంట్రోల్ రోడ్డు నిర్మించనున్నారు. భూసేకరణ, భూములకు పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ నిర్వహిస్తోంది. గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ప్రాథమిక దశ పనులు ప్రారంభించారు. రోడ్డు నిర్మించే నిడివి మొత్తం నేల స్వభావాన్ని ప్రత్యేక యంత్రాల ద్వారా రిగ్గింగ్ చేసి పరిశీలిస్తున్నారు. అలాగే అవసరమైన చోట రోడ్డు క్రాసింగులు, జంక్షన్లు, వాగులు, కాలువలపై వంతెనల నిర్మాణం, గ్రామాల వద్ద క్రాసింగ్ ల వద్ద బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తెప్పించిన యంత్రాలతో (సాయిల్ టెస్టింగ్) భూ పరీక్షలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి మండలాల పరిధిలోని గ్రామాల్లో యంత్రాల ద్వారా భూ పరీక్షల కోసం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే మరోవైపు భూ నిర్వాసితులైన రైతులు తమకు ఆశించిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వ్యవహారం ఓవైపు నడుస్తుండగానే మరోవైపు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం విశేషంగా మారింది.