ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం..

ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం..
  • గ్రామాల అభివృద్ధికి బిజెపి కృషి..
  • ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచినిపర్తి, చల్లగరిగ, జూకల్, తిరుమలాపురం తదితర గ్రామాల్లో కీర్తిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రేషన్ బియ్యం మొదలుకొని గ్రామాలకు వచ్చే సంక్షేమ పథకాలు అన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవేనని తెలియజేశారు. రైతులకు ఎకరానికి వేసే ఎరువుల్లో  రూ.18 వేల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు ఐదు నుండి పది కిలోల వరకు తరుగు పేరిట కోత విధిస్తున్నారని, బిజెపి అధికారంలోకి వస్తే బస్తాకు అరకిలో మాత్రమే తీసేలా చర్యలు చేపట్టనుందన్నారు. గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని 100 శాతం ఆ బెల్ట్ షాపులు లేకుండా తొలగించేందుకు బిజెపి కృషి చేయనుందన్నారు. కుటుంబంలో ఒక్కరికే కాకుండా భార్య భర్తలు ఇద్దరికీ పింఛన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా భూములమ్మి, అప్పులు చేసి పిల్లలను చదివిస్తే చివరికి ఉద్యోగాలు లేక యువత నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగాలు లేక వివిధ షాపుల్లో గుమస్తాగా పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. పూటకో పార్టీ మార్చే నాయకులను నమ్మవద్దని నన్ను మీ ఆడబిడ్డగా ఆశీర్వదించి తనకు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, రాష్ట్ర, జిల్లా నాయకులు నాగపురి రాజమౌళి గౌడ్, మాచర్ల రఘు, నీలి సుధాకర్ రెడ్డి, జాలిగపు ఓదెలు తదితరులు పాల్గొన్నారు.