పేదల బియ్యం..దళారుల పాలు

పేదల బియ్యం..దళారుల పాలు
  • యదేచ్చగా సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం
  • కొరవడిన నిఘా,నియంత్రణ కరువు
  • "మామూలు"గా తీసుకుంటున్న అధికారులు

కాటారం,ముద్ర న్యూస్: నిరుపేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం దళారుల జేబులు నింపుతోంది.దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి అందాల్సిన సరుకు పక్కదారి పడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది.పేదల బియ్యం దర్జాగా సరిహద్దులు దాటుతున్నా అడ్డుకునే వారే కరువయ్యారు. భూపాలపల్లి జిల్లాలో 277 రేషన్ దుకాణాల పరిదిలో 1,23,640 ఆహార భద్రత కార్డులు,9253 అంత్యోదయ కార్డులుండగా వీటిలో 3లక్షల46వేల511 (3,46,511)మంది లబ్ధిదారులకు నెల నెలా 1,564 టన్నుల బియ్యం పేదలకు ఉచితంగా పంపిణీ అవుతున్నాయి.ఈ బియ్యం ప్రతీ నెల 5 వ తేదీ లోపు అన్ని రేషన్ దుకాణాలకు చేరుకోగా 5-20 వ తేదీ వరకు లబ్ధిదారులకు డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ఇక ఇక్కడే పేదల కడుపు కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిలో బియ్యానికి 8-10 రూపాయలు ఇస్తామని నమ్మబలికి వారికి పంపిణీ చేసిన బియ్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రేషన్ షాపు డీలర్లే పేదల బియ్యాన్ని కొని దళాలకు విక్రయిస్తున్నారు.జిల్లాలోని కాటారం, మహాదేవ్ పూర్, మహాముత్తారం, మలహర్ రావు,చిట్యాల,భూపాలపల్లి, ఆజంనగర్,ఘనపురం,మొగుల్లపెల్లి మండలాలలో దళారులు ఏర్పాటై గ్రామాల వారిగా అనుచరులను నియమించుకుని పేదల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు.

ఈ తతంగం అంతా ప్రతీరోజు జరుగుతున్నా సంబందిత అధికారులు కనీసం కన్నెత్తి చూసిన సందర్భం లేదు.నెలలో 10 వ తేదీ నుంచి దళారులు సేకరించిన బియ్యాన్ని వందలాది లారీలు, డీసీఎం,ఆటోల ద్వారా యదేచ్చగా సరిహద్దులు దాటించి మహారాష్ట్రకు తరలిస్తున్నారు.తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ఐన కాళేశ్వరం సమీపంలోని అంతర్రాష్ట్ర బ్రిడ్జి,మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్,అన్నారం బ్యారేజ్ ల ద్వారా ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.ప్రతీనెల వేలాది టన్నుల బియ్యం యదేచ్చగా అక్రమంగా రవాణా కావడం అధికారుల పనితనాన్ని తేటతెల్లం చేస్తుందని లబ్ధిదారులు విరుచుకుపడుతున్నారు.జిల్లా పరిదిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా క్ఱణాల్లో పసిగట్టే పోలీసు, టాస్క్ఫోర్స్, రెవెన్యూ అధికారులకు నిరంతరాయంగా జరుగుతున్న ఈ అక్రమ రవాణా గురించి తెలియకపోవడం విడ్డూరమేనని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు.ఈ తతంగం అంతా అధికారులకు తెలిసే వారి కనుసన్నల్లోనే జరుగుతుందని పలువురు అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు.అక్రమార్కులు అందించే అమ్యామ్యాలకు ఆశపడి బియ్యం అక్రమ వ్యాపారానికి అధికారులు అండదండలు దండిగా అందించుతూ జేబులు నింపంకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రతీనెల 8-25 తేదీల మద్య రేషన్ బియ్యం అంతర్రాష్ట్ర వంతెనల మీదుగా సరిహద్దులు దాటుతోందని అంటున్నారు. ఈ సమయంలో ఉన్నతాధికారులు ఆయా రహాదారులు,ప్రాంతాలలో తనిఖీలు చేపడితే ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణాను అరికట్టవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై జయశంకర్ భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ను వివరణ కోరగా ఎవరైనా వ్యక్తులు పిర్యాదు చేస్తే విచారణ జరిపి పట్టుకుంటామని బదులిచ్చారు.