నాణ్యమైన విద్యుత్ అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం..

నాణ్యమైన విద్యుత్ అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..
  • నైన్ పాకలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలో రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులకు, రూ.1.50కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ల చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడం కాంగ్రెస్ వాళ్లకు నచ్చడం లేదన్నారు. మూడు గంటల కరెంట్ చాలని ఒకరు, వచ్చే కరెంట్ కు  మీటర్లు పెట్టాలని చూసే వాళ్ళు మరొకరు మాట్లాడుతున్నారంటే, ఇలాంటి వాళ్లు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ వస్తే ప్రతిపక్ష పార్టీలకు కడుపు నొప్పి వస్తుందని, ప్రజలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వాళ్లకు నచ్చడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంపై కుట్రపూరితంగా మాట్లాడుతున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సబ్ స్టేషన్ ల ముందు ధర్నా చేయడం సిగ్గు చేటు, రైతులకు కరెంట్ వద్దు అన్న మీరు, ధర్నా చేయడం ఏంటి అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, ఎస్ఈ మల్సూర్, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, సర్పంచ్ లు తొట్ల లక్ష్మీ, పెండెల సాంబయ్య, ఎంపీటీసీ కట్టెకొల్ల రమేష్, వైస్ ఎంపీపీ రాంబాబు, పీఏసీఎస్ డైరెక్టర్ స్వప్న, మహిళా మండల అధ్యక్షురాలు మల్లమ్మ, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.