అందరి సహకారంతో కంటి వెలుగు  విజయవంతం

అందరి సహకారంతో కంటి వెలుగు  విజయవంతం

  • 99 రోజుల్లో  5,17,719మందికి పరీక్షలు
  • లక్ష 74 వేల 33 మందికి కంటి అద్దాలు 
  • 'ముద్ర ప్రతినిధి'ప్రత్యేక ఇంటర్వ్యూ లో సిద్దిపేట జిల్లా వైద్యాధికారి జూలూరి కాశీనాథ్

ముద్రప్రతినిధి, సిద్దిపేట: సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటారు పెద్దలు.. మనిషికి ఉన్న అన్ని అంగాలలో కండ్లు ప్రధానమైనవి.. కంటి చూపు మందగిస్తే మనిషికి ఇబ్బందులు తప్పవు.. అటువంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన అనేక కార్యక్రమాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రధానమైనది.దాదాపు మూడు నెలల పాటు నిరంతరాయంగా కొనసాగిన రెండో విడతగా జిల్లాలో జరిగిన కంటి వెలుగు పరీక్షా శిబిరాలు విజయవంతంగా ముగిచాయి. ఎందరికో దృష్టిని ప్రసాదించాయి.. నిరుపేదల,వృద్ధుల జీవితాల్లో వెలుగును నింపాయి.. సిద్దిపేట జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగి ముగిసిన సందర్భంగా రాష్ట్ర,ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు...
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డి ఎం అండ్ హెచ్ ఓ) డాక్టర్ జూలూరి కాశీనాథ్ తో 'ముద్ర ప్రతినిధి' ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూ వివరాలు ఇవి..

ప్రశ్న : జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు ఎన్ని చోట్ల నిర్వహించారు. ఎన్ని రోజులు  జరిగాయి ?

జవాబు: ముఖ్యమంత్రి ,ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో రెండో విడతగా జనవరి 19న సిద్దిపేట జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించాం 45 వైద్య బృందాలు మరో మూడు బఫర్ టీములు కంటి వైద్య శిబిరాలు నిర్వహించాయి.499 గ్రామ పంచాయతీల్లో,  సిద్దిపేట,హుస్నాబాద్, చేర్యాల,గజ్వేల్, దుబ్బాక తదితర ఐదు మున్సిపాలిటీలల లోని 115 కౌన్సిలర్ల వార్డులలో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించాం.జిల్లా వ్యాప్తంగా ఈ శిబిరాల నిర్వహణకు 99 రోజులు సమయం పట్టింది.

ప్రశ్న : కంటి వెలుగు శిబిరాల్లో ప్రజలకు కంటి పరీక్షలు ఎలా నిర్వహించారు. ఎందరికి నిర్వహించారు.ఉచిత కంటి అద్దాల పంపిణీ అందరికీ జరిగిందా ?
జవాబు : మారిన పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకొని అందరి పేర్లను ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో, అడ్రస్ ను మొదట ట్యాబ్ ఎంట్రీ చేసుకున్నాం. అత్యాధునిక
టెస్టింగ్ ఏ ఆర్ మిషన్ల ద్వారా కంటి పరీక్షలు నిర్వహించాం.వర్డ్స్ టెస్టింగ్ ద్వారా కంటి చూపులలో ఉన్న వ్యత్యాసాలను తెలుసుకున్నాం. నిపుణులైన ఆప్తాల్మిక్ ఆఫీసర్స్ ,కంటి వైద్య సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఈ క్రతువులో పాల్గొన్నారు. నిరక్షరాస్యులకు కూడా ప్రత్యేకంగా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాము. జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి కురువృద్ధులు దాకా కంటి పరీక్షలు చేయించుకున్నారు. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో 5,17,719 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాం 92,447 మందికి రీడింగ్ గ్లాసులను వెంటనే ప్రజలకు అందజేశాం. 81,586 మందికి దూరపు చూపు కంటి అద్దాలను ప్రత్యేకంగా తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నాం.దూరపు చూపు అద్దాలు ఇప్పటివరకు 74,022 మందికి పంపిణీ చేశాం. 7,564 మందికి మరో 15 రోజుల్లో అందజేస్తాం.శిబిరాల్లో తాము పరీక్షలు నిర్వహించిన వారందరికీ కంటి అద్దాలు అవసర పడలేదు.అవసరపడ్డ వారికి మాత్రమే వాటిని అందజేయడం జరిగింది.అదేవిధంగా కంటి వెలుగు శిబిరంలో పాల్గొన్న వారికి అవుట్ పేషంట్ ఫైల్ ను వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందజేశాం. కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కరపత్రాలను, బ్రోచర్లను అందజేశాం.

ప్రశ్న: ఆరోగ్య,వైద్య శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందన ఎలా ఉంది.శిబిరాల విజయవంతానికి ఎవరు సహకరించారు ?

జవాబు : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు  సొంత జిల్లాలో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైంది. అంతట ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు,వార్డు నెంబర్లు, మున్సిపాలిటీలలో చైర్మన్లు,కౌన్సిలర్లు, కమిషనర్లు,సిబ్బంది, స్థానిక నేతలు పెద్ద ఎత్తున సహకారం అందించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిరంతరం పర్యవేక్షణ చేయడం, అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన సహకారంతో అన్ని గ్రామ పంచాయతీల్లో కంటి వెలుగు శిబిరాలు విజయ వంతమయ్యాయి. జిల్లాలో కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు,సూపర్వైజర్లు
 ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.దీంతో నూరు శాతం శిబిరాలు విజయవంతమయ్యాయి.

ప్రశ్న : కంటి ఇతర సమస్యలు ఏమైనా ఈ శిబిరంలో గుర్తించారా.. వారికి మీరిచ్చిన సలహాలు ఏమిటి ?

జవాబు : కంటిలో ఇతర సమస్యలు ఉన్నవారి నీ గుర్తించి డాక్టర్లు, వైద్య సిబ్బంది వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. క్యాటరాక్టు సమస్యలు ఉన్న వారిని కంటి ఆపరేషన్ల కోసం రెఫర్ చేయడం జరిగింది.