కెసిఆర్ నన్ను టార్గెట్ చేశారు..

కెసిఆర్ నన్ను టార్గెట్ చేశారు..
  • ములుగుకు బినామీలను పంపిస్తున్నారు..
  • ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి(ములుగు): కెసిఆర్ నన్ను టార్గెట్ చేశారని, ములుగుకు ఆయన బినామీలను పంపిస్తున్నారని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు నియోజకవర్గంలోని వెంకటాపురం మండలం మల్లయ్య పల్లి, నారాయణపూర్, అందుగులమేది, తిమ్మాపూర్, బూరుగుపేట, ఆనందపూర్, పట్వారిపల్లి, లక్ష్మీదేవి పేట, నల్లగుంట, ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆయా ముఖ్య కూడళ్ల వద్ద సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని ఒక ఆదివాసి బిడ్డనైన నేను ప్రశ్నించే గొంతుకగా ఉన్నానని, కెసిఆర్, ఆయన కుటుంబం నన్ను టార్గెట్ చేసి ఓడించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని అన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు వారి బినామీలు ములుగు చేరుకుంటున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులను ముంచి పైకొచ్చిన కేసీఆర్ అదే డబ్బులతో ఈరోజు గ్రామ గ్రామాన ప్రజల ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

అటు రైతులను ఇటు యువకులను ఏమాత్రం పట్టించుకోకుండా నిండా ముంచిన కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చే డబ్బులను తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగాలు వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు 4 వేల రూపాయలు అందించడం జరుగుతుందని, పేదవారికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇళ్లలో ఉచిత కరెంటు, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి, విముక్తి కల్పించడం జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు 24 గంటల కరెంటు తప్పకుండా ఇస్తుందని తెలియజేశారు. రైతులకు 15 వేల రూపాయల రైతుబంధు, భూమిలేని కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వడంతో పాటు పండించిన పంటలకు కూడా బోనస్ గా క్వింటాల్ కు రూ.500లు అందించడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, సోషల్ మీడియా ఇంచార్జి బొమ్మ కంటి రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.