కామారెడ్డికి గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తాం    

కామారెడ్డికి గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తాం    
  • మేనిఫెస్టోలో లేని పనులు చేశాం                                     
  • కేసీఆర్ భరోసా పై ప్రచారం చేయాలి                                                       
  • కామారెడ్డి అభివృద్ధి కి ప్రణాళిక : కేటీఆర్  

                                                           

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డికి గోదావరి జలాలను తెప్పించి గ్రామ గ్రామానికి అందించి సస్యశ్యామలం చేస్తామని బిఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి అభివృద్ధి కోసమే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. కామారెడ్డిలో లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో 114 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా, అందరి దృష్టి కామారెడ్డి పై ఉందని, సిఎం కెసిఆర్ ఇక్కడ పోటి చేయడమే ఇందుకు కారణమని అన్నారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ వేయడానికి విచ్చేస్తున్నారని అన్నారు. షబ్బీర్ అలీ స్థానంలో రేవంత్ రెడ్డి వస్తున్నారట, ఆయన ఏం చేస్తాడు? అని ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చాక కామారెడ్డి భూములకు డిమాండ్ పెరుగుతుందని, ఇక్కడి నుంచి 60 కిలోమీటర్ల వరకు సిరిసిల్ల, మెదక్, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.  గజ్వేల్ ఎలా అభివృద్ధి చెందినదో, కామారెడ్డి అలా అభివృద్ధి చెందుతుందన్నారు. స్పెషల్ ఆఫీసర్ ద్వారా అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఇప్పటికే కామారెడ్డి అభివృద్ధి కోసం వందల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రం, కలెక్టర్, ఎస్పీ, మెడికల్ కళాశాల తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 9న నామినేషన్ కార్యక్రమానికి ఇంటింటి నుంచి ముగ్గురు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. వంద ఓట్లకు ఒక ఇంచార్జి ని నియమించి, ఇంటింటికి వెళ్లి  కల్యాణ లక్ష్మి, రైతు బంధు,  ఆసరా ఫించన్లు, రైతు బీమా తదితర పథకాల గురించి వివరించాలన్నారు. కేసీఆర్ భరోసా ద్వారా ఫించన్ల పెంపు, తెల్ల కార్డుపై సన్న బియ్యం, ప్రతి ఒక్కరికీ కేసీఆర్ బీమా, 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ.3వేల భృతి ఇస్తామని, రూ.400కె సిలిండర్ ఇస్తామని అన్నారు. మేనిఫెస్టోలో లేని హామీలను గతంలో అమలు చేశారని, ప్రస్తుతం హామీలు ఇచ్చిన తర్వాత అమలు చేస్తామని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ తీరు కారణంగా సస్పెండ్ చేశామని, వారు కాంగ్రెస్ లో చేరినట్లు పేర్కొన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని కెటిఆర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ మ్యూజిబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.