చిల్లర రాజకీయాలు మానండి

చిల్లర రాజకీయాలు మానండి
  • వానలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే రాజకీయం తగదు
  • ప్రతిపక్షాలకు మినిస్టర్​కేటీఆర్​సూచన
  • కలెక్టర్లు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు మానుకువాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో పట్టణాల్లో పరిస్థితులపై గురువారం మంత్రి కేటీఆర్ కలెక్టర్లు, ఇతద అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రధాన ఏజెండా పెట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైందన్నారు.

  • ప్రాణనష్టం జరగొద్దు..

ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను కేటీఆర్​అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదకన పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించామని వెల్లడించారు. 

  • ప్రజలకు అండగా ఉండండి  ! 

భారీ వర్షాలతో ప్రభావితమైన ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్​కోరారు. కొన్ని జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ప్రజలకు తోడుగా నిలవాలని  పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. స్థానికంగా పార్టీ శ్రేణులు ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు అందించడం నుంచి తోచిన ఇతర మార్గాల్లోనూ సహాయం చేయాలన్నారు.